- ప్రజాస్వామ్యం బతికే ఉందని ఈ ఎన్నికలు నిరూపించాయి: వంశీకృష్ణ
- పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ
- బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపణ
- తనపై రాహుల్, రేవంత్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న పెద్దపల్లి ఎంపీ
కోల్బెల్ట్, వెలుగు: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు అహంకారపూరిత పరిపాలనతో పదేండ్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. మోదీ పాలన వద్దంటూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని నిరూపించినట్లయిందని పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.
తన గెలుపు ప్రజల విజయమని, ఇందుకు కృషి చేసిన పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ఎన్ని హింసలకు గురిచేసినా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాను విడవకుండా కష్టపడి.. తనను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేశారన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.
కాకా వెంకటస్వామి చేసిన సేవలు, పదేండ్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేసిన మంచి పనులను చూసి ప్రజలు తనకు ఎంపీగా అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ ఎన్నికల్లో యువత బీజేపీ వైపు ఉందని చాలా మంది అనుకున్నారని, కానీ పెద్దపల్లి యువత ఎటూ పోలేదని, కాంగ్రెస్కే అండగా ఉందని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మంథని ప్రజలు అత్యధిక మోజార్టీ ఇవ్వడంతో తన గెలుపు సాధ్యమైందన్నారు. యువతకు అండగా ఉంటానని భావించి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తనకు పెద్దపల్లి నుంచి అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైనయ్..
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని వంశీకృష్ణ ఆరోపించారు. కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడం కోసం ఈ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహాయం చేసింద న్నారు. పోలైన ఓట్లను బట్టి చూస్తే ఈ రెండు పార్టీలు కలిసిపోయినట్టు అర్థమవుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీకి కేసీఆర్ సపోర్టు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కొద్ది రోజుల్లోనే జైలు నుంచి కవిత బయటికి వస్తుందని చెప్పారు.
బీజేపీకి ఓటు బ్యాంకు లేదని, బీఆర్ఎస్ వాళ్లు ఆ పార్టీకి ఓట్లు వేశారన్న విషయం పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టంగా బయటపడిందన్నారు. రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రజాపాలన వచ్చిందని, రాబోయే కాలంలో అంత మంచే జరుగుతుందని చెప్పారు.
ఎంపీగా వంశీని ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు: వివేక్ వెంకటస్వామి
దేశ ప్రజలు మోదీని, బీజేపీని నమ్మలేదని, అందుకే సాధారణ మోజారిటీ సీట్లు కూడా ఇవ్వలేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. వంశీకృష్ణను ఎంపీగా భారీ మోజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ కాకా వెంకటస్వామి కంచుకోట అని ప్రజలు మళ్లీ నిరూపించారన్నారు. కాకా వెంకటస్వామి చేసిన మంచి పనులు గుర్తించి తనను ఎమ్మెల్యేగా, తన కొడుకును ఎంపీగా గెలిపించారని తెలిపారు.
బీజేపీ ప్రభావం ఉన్న నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ చుట్టుపక్కల ఆ పార్టీ అభ్యర్థులు గెలిచినా.. పెద్దపల్లిలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను ఎంపీగా ఆదరించారన్నారు. వంశీ గెలుపునకు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు. ప్రజాపాలన కావాలని తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లను భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. ఆగస్టు 15లోపు సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీ చేస్తారని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారని చెప్పారు.
తెలంగాణను ఎలాగైతే.. గత బీఆర్ఎస్ సర్కార్ రూ.7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందో.. మోదీ ప్రభుత్వం దేశాన్ని రూ.155 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి, చెన్నూరు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ, లీడర్లు ఐత హేమవంత్ రెడ్డి, గొడిసెల బాపురెడ్డి, చీర్ల సుధాకర్ రెడ్డి, రాజమల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.