స్కూళ్లపై స్పెషల్ ​ఫోకస్ : ఎంపీ వంశీకృష్ణ

  • మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచాలి: ఎంపీ వంశీకృష్ణ
  • దిశ కమిటీ చైర్మన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశం

మంచిర్యాల, వెలుగు: స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచాలని, డీఈవో రెగ్యులర్​గా తనిఖీలు చేసి రిపోర్ట్ అందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్​లో జిల్లా​డెవలప్​మెంట్, కో ఆర్డినేషన్​ అండ్​మానిటరింగ్(దిశ) కమిటీ మీటింగ్​నిర్వహించారు. ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు, కలెక్టర్​ కుమార్​దీపక్, డీఆర్డీవో కిషన్​తో కలిసి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించారు.

 ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్​అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై దృష్టి సారించాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. జిల్లా నుంచి కరీంనగర్, హైదరాబాద్​కు రెఫరల్​కేసులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మంచిర్యాల, వరంగల్​ నేషనల్ హైవే 163 నిర్మాణంతో గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్​లు నిర్మించాలని ఎన్​హెచ్​ఏఐ అధికారులను ఆదేశించారు. ఎన్​హెచ్​ 63 పెండింగ్ పనుల విషయంలో ఫారెస్ట్ పర్మిషన్ల కోసం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్​కు విన్నవించినట్టు చెప్పారు. క్యాతన్​పల్లి ఆర్వోబీతో పాటు క్యాతన్​పల్లి, మంచిర్యాల ఫోర్​లేన్​ రోడ్డు పనులు నత్తనడకన జరుగుతున్నాయని మండిపడ్డారు. పనులు త్వరగా కంప్లీట్​చేయాలన్నారు. 

ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలని, తరుగు పేరిట కోతలు పెట్టి రైతులను దోచుకుంటే ఊరుకునేది లేదని ఎంపీ హెచ్చరించారు. ఉపాధి హామీ, నేషనల్​ హెల్త్​ మిషన్, డబుల్​ బెడ్రూంలు, మహిళా సంఘాల ప్రగతి, ఆహార భద్రత, రేషన్, గ్యాస్​ పంపిణీ, అంగన్​వాడీ సెంటర్ల అప్​గ్రేడేషన్, ట్రైబర్​ వెల్ఫేర్, రైల్వేస్​తో పాటు వివిధ పథకాలు, ప్రాజెక్టులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

    
జిల్లాలో కరెంట్​ లేని ఇండ్లు 200 మాత్రమే ఉన్నాయని ఆ శాఖ ఎస్ఈ చెప్పగా ఎంపీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోసారి సర్వే నిర్వహించి కరెక్ట్​రిపోర్టు ఇవ్వాలని, కరెంట్ డిమాండ్, సప్లయ్ వివరాలు అందిచాలని, పవర్​కట్స్​ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

రైల్వే అధికారికి షోకాజ్​ నోటీస్

మంచిర్యాల రైల్వే సూపరింటెండెంట్ దిశ మీటింగ్​కు రాకుండా కిందిస్థాయి అధికారిని పంపించారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ కుమార్​ దీపక్ అన్నారు. మీటింగ్​కు డుమ్మా కొట్టిన జిల్లా అధికారులను మందలించారు. 

దుర్గాదేవి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీ రైల్వే కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో ఏర్పాటు చేసిన ధ్వజ స్థంభం ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి రైల్వే మజ్దూర్ యూనియన్ చైర్మన్ నాగరాజు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం సెక్రటరీ శివ, సెక్రటరీ తిర్పల్ నాయక్ స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేత అంజద్ ఆధ్వర్యంలో సాయంత్రం బెల్లంపల్లిలోని ప్రగతి జూనియర్ కాలేజీలో గ్యార్మీ షరీఫ్ వేడుకలు నిర్వహించగా విందులో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ పాల్గొన్నారు. 

ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, ఏసీపీ రవికుమార్, మాజీ ప్రెసిడెంట్ కంకటి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ రొడ్డ శారద, కాంగ్రెస్ నాయకులు కేవీ ప్రతాప్, మునిమంద రమేశ్, నాతరి స్వామి, దావ రమేశ్ బాబు, గాలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.