హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ అకౌంట్లను సీజ్ చేయడంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ ఖాతాల్లో ఉన్న డబ్బులను వాడుకోనివ్వకుండా ఆంక్షలు విధించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ‘‘నాలుగు బ్యాంకుల్లో కాంగ్రెస్‌కు చెందిన మొత్తం 11అకౌంట్లు సీజ్ అయ్యాయి. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ఇలా చేస్తోంది. ఎలక్టోలర్ బాండ్ల విషయంలో బీజేపీ స్కామ్ కు పాల్పడింది. 50 శాతానికి పైగా ఎలక్టోరల్ బాండ్లు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. ఒక్క మేఘా కంపెనీ నుంచే రూ.170 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అందాయి. తొమ్మిదిన్నర ఏండ్లలో బీజేపీ డొనేషన్లు పది రెట్లు పెరిగాయి” అని మహేశ్ వ్యాఖ్యానించారు.
