ఇవాళ గాంధీభవన్లో పీఏసీ సమావేశం..కేసీ వేణుగోపాల్ రాక

  • నేడు పీఏసీ మీటింగ్..కేసీ వేణుగోపాల్ రాక
  • హాజరుకానున్న కేసీ వేణుగోపాల్,  సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్, పీఏసీ మెంబర్లు
  • ఏడాది పాలన, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, పీసీసీ కార్యవర్గం భర్తీపై చర్చ

హైదరాబాద్, వెలుగు: పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం బుధవారం సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది. ఈ మీటింగ్​కు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 23 మంది పీఏసీ మెంబర్లు పాల్గొననున్నారు.

 అలాగే, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షీ, పీసీసీ మాజీ అధ్యక్షులు, సీఎల్పీ మాజీ నేతలు, రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ ఆఫీసు బేరర్లూ హాజరవుతారు.

 పీఏసీ మెంబర్ల జాబితాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజ నర్సింహ, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్ తదితర నేతలు ఉన్నారు. ఈ సమావేశంలో రాజకీయపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడంపై చర్చించనున్నారు. 

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు గోపాల్ దీనికి చీఫ్​గెస్టుగా అటెండ్ అవుతున్నందున, హైకమాండ్ తరఫున ఆయన పార్టీ నేతలకు ఎలాంటి  దిశా నిర్దేశం చేయనున్నారనే దానిపైనే రాష్ట్ర పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.

 రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పాలన తీరుపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు తీరు.. రాబోయే నాలుగేండ్లలో కాంగ్రెస్ ప్రతిష్టను పెంచే రీతిలో ఎలాంటి పాలన  చేపట్టాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అలాగే, కేబినెట్ విస్తరణ, మిగిలిన నామినేటెడ్ పోస్టులు, పీసీసీ కార్యవర్గం భర్తీపై కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి.

 రానున్న లోకల్ బాడీ ఎన్నికలతో పాటు మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, వారిని గెలిపించుకునేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే అంశంపై ఇందులో చర్చించి, నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.