న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన 1,500 అప్లికేషన్లే సాక్ష్యమన్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బుధవారం పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నేతృ త్వంలో ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. ఇందులో ఆ రాప్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్, షర్మిల, సీనియర్ నేతలు రఘువీరా రెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు.
అనంతరం షర్మిల మాట్లాడుతూ.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 1.17 శాతం ఓట్లు రాగా.. ఈసారి పెద్ద మొత్తంలో ఓటు శాతం పెంచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు పార్టీ నాయకులు సైనికులుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఐదేండ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన అనుభవం కనీసం రాజధాని కట్టుకోవడానికి కూడా పనికిరాలేదని ఎద్దేవా చేశారు. గతంలో ప్రత్యేక హోదా గురించిన మాట్లాడిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.