కేటీఆర్​ జైలుకు వెళ్లక తప్పదు : పీసీసీ చీఫ్​ మహేశ్

  • పదేండ్లు అధికారమిస్తే కేసీఆర్ ఫాంహౌస్​కే పరిమితమైండు:  పీసీసీ చీఫ్​ మహేశ్ ​


సికింద్రాబాద్, వెలుగు: ఫార్ములా– ఈ రేస్​​కేసులో బీఆర్ఎస్  వర్కింగ్​ ప్రెసిడెంట్  కేటీఆర్​జైలుకు వెళ్లక తప్పదని పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్​ అన్నారు. రాష్ట్రంలో తాము  ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చామని, ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీకి  ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి టీపీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ విద్యార్థి నాయకుడు చనగాని దయాకర్ ఆధ్వర్యంలో శనివారం కృతజ్ఞతా బహిరంగ సభను  ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ  చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర  గ్రంథాలయ చైర్మన్ రియాజ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేశ్​కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి కృతజ్ఞత సభలో విద్యార్థులతో మాట్లాడడం గర్వంగా ఉందన్నారు. ఎన్ఎస్ యూఐ నాయకుడి గా ఉన్నప్పుడు ఓయూ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఓయూ విద్యార్థుల పాత్ర ఉన్నదని చెప్పారు.  కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ఏపూరి సోమన్న  తదితరులు పాల్గొన్నారు.