దేశాన్ని కష్టాల నుంచి రాహుల్ గట్టెక్కిస్తారు

  • వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు  
  • పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. క్రికెటర్ విరాట్ కోహ్లీ పాత్ర పోషిస్తారని తెలిపారు. రాహుల్ కమిట్మెంట్ ఉన్న నాయకుడని తెలిపారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో జరిగిన ‘ది హిందూ లిట్ ఫర్ లైఫ్ డైలాగ్2025’ ప్రోగ్రాంలో మహేశ్ గౌడ్ పాల్గొన్నారు. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కోహ్లీ ఏ విధంగా బాధ్యతాయుత బ్యాటింగ్ చేసి జట్టును గెలిపిస్తాడో..రాబోయే రోజుల్లో రాహుల్ కూడా కష్టాల్లో ఉన్న దేశాన్ని అదే మాదిరిగా గట్టెక్కించనున్నాడని చెప్పారు. 

కేసీఆర్ పాలనలో అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు అనుభవిస్తూ అసెంబ్లీకి కూడా రావడం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని దాదాపుగా నెరవేర్చామన్నారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్, నీర్జా చౌదరితో కలిసి పీసీసీ చీఫ్​ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.

బీసీలకు నామినేటెడ్ పదవులివ్వండి: జాజుల వినతి

రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్న నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పాలన విభాగాలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50శాతం వాటా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. దాని కోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలన్నారు.  ఆయన శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ను కలిసి వినతిపత్రం అందచేశారు. మంత్రివర్గంలో, నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పరిపాలన విభాగాలలో, ఇతర అధికారిక పోస్టుల్లో బీసీలకు జనాభా ప్రకారం వాట కల్పించడం లేదని తెలిపారు.