ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా ఇస్తం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులకు ఆయన ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నది. పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించింది.

ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం.. అడ్డగోలు వ్యవహారాలు.. కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డమైన పనులు చేయడంతో రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోయింది. రాష్ట్రం రూ.7లక్షల కోట్ల అప్పులతో ఉన్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎక్కడ వెనుకడగు వేయడం లేదు. ఆర్థిక సమస్యలున్నా.. అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం’’అని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.

రూ.22 వేల కోట్లతో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. ‘‘ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్​కు రూ.500 బోనస్ ఇచ్చాం. గతేడాది రైతు భరోసా ఇచ్చాం. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు పెంచి ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నయ్. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నరు. తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా కార్యక్రమాలపై ప్రజలు, రైతులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవాలి’’అని మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.

గాంధీ భవన్​లో రైతు భరోసా సంబురాలు
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలు అమలు చేస్తుండటంపై పీసీసీ హర్షం వ్యక్తం చేసింది. ఆదివారం గాంధీభవన్ లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో సంబురాలు చేశారు.  రైతులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నందుకు మెట్టు సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు.