బీజేపీ దళిత వ్యతిరేకి .. అమిత్ షా కామెంట్లతో స్పష్టమైంది : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్​పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లతో బీజేపీ.. దళిత వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని ఆ పార్టీ కుట్రపూరితంగానే దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు. రాహుల్​పై హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షితో గాంధీభవన్​లో సోమవారం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘‘అంబేద్కర్​ను అమిత్ షా అవమానించారు. వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడ్తున్నరు.

 అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నరు. తర్వాత కలెక్టర్ ఆఫీస్​కు వెళ్లి వినతిపత్రాలు ఇస్తున్నరు. ఆ వినతిపత్రాలన్నింటినీ రాష్ట్రపతికి పంపిస్తం. దళితులను అమిత్ షా తీవ్రంగా అవమానించారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి మండిపడ్డారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ తొలగించే కుట్ర చేస్తున్నది. అమిత్ షా కామెంట్లతో ఇది స్పష్టమవుతున్నది. అమిత్​షాను వెంటనే బర్తరఫ్ చేయాలి’’అని దీపాదాస్ మున్షి డిమాండ్ చేశారు.