- క్యూ2లో రూ. 482 కోట్ల నష్టం
- 65 శాతం పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎంకు ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్‌లో రూ.482 కోట్ల నష్టం వచ్చింది. జూన్ క్వార్టర్లోనూ ఇది రూ. 376.60 కోట్లు నష్టపోయింది. అయితే గతేడాది సెప్టెంబరులో క్వార్టర్లో రూ. 435.50 కోట్ల నష్టం రాగా, ఇది ఈసారి రూ.482 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం మాత్రం 64 శాతం పెరిగి రూ.1,086.40 కోట్లకు చేరుకుంది. యూపీఐ యేతర చెల్లింపు వాల్యూమ్‌లలో (జీఎంవీ) 52 శాతం గ్రోత్ రావడం, ఇతర సెగ్మెంట్ల ఆదాయాలు కూడా పెరగడం ఇందుకు కారణమని పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. పేటీఎం ఈ నెలలో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన తర్వాత మొదటిసారిగా తన ఆదాయాలను వెల్లడించింది. పేమెంట్స్, ఆర్థిక సేవల ఆదాయం 69 శాతం పెరిగి రూ. 842.60 కోట్లకు చేరుకోగా, కమర్షియల్, క్లౌడ్ సేవల ఆదాయం 47 శాతం పెరిగి రూ. 243.80 కోట్లకు చేరుకుందని కంపెనీ బిఎస్‌ఇ ఫైలింగ్‌లో తెలిపింది. ఆర్థిక సేవలు, ఇతర ఆదాయం 250 శాతం పెరిగి రూ. 88.70 కోట్లకు చేరుకుంది. లోన్లు, వెల్త్ (పేటీఎం మనీ) రాబడులు భారీగా పెరిగాయి. దీంతో ఆర్థిక సేవలు, ఇతర ఆదాయాల వాటా మొత్తం ఆదాయం గత క్యూ2తో పోలిస్తే ఈ క్యూ2లో 3.8 శాతం నుండి 8.2 శాతం పెరిగింది.
107 శాతం పెరిగిన జీఎంవీ
కంపెనీ గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (జీఎంవీ) 107 శాతం గ్రోత్‌తో రూ. 1,95,600 కోట్లకు చేరింది. ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రోత్ ఊపు కొనసాగిందని, అందుకే జీఎంవీ ఏడాది ప్రాతిపదికన భారీగా పెరిగిందని కంపెనీ తెలిపింది. యావరేజ్ ట్రాన్సాక్షన్స్ మంత్లీ యూజర్లు (“ఎంటీయూ”) 33 శాతం పెరిగి 5.74 కోట్లకు చేరుకున్నారు. అక్టోబర్‌లో వీరి సంఖ్య 6.3 కోట్లు. మర్చంట్ పార్ట్‌నర్ల సంఖ్య తాజా క్వార్టర్లో 2.3 కోట్లకు పెరిగింది. ఇది కిందటి సంవత్సరం రెండో క్వార్టర్లో 1.85 కోట్లుగా ఉంది. పేటీఎం ఆల్-ఇన్-వన్ క్యూఆర్ కోడ్, పేటీఎం ఆల్-ఇన్-వన్ పీఓఎస్, పేటీఎం సౌండ్‌బాక్స్ వంటి ఆఫ్‌లైన్ చెల్లింపు విధానాల వల్ల ఈ పెరుగుదల సాధ్యమైంది. క్యూ2లో డివైజ్‌ల బేస్ 3 లక్షల నుండి 13 లక్షలకు పెరిగింది. అన్ని రకాల డివైజ్‌ల అమ్మకాలు పెరిగాయని పేటీఎం తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో లోన్ల సంఖ్య 714 శాతం పెరిగి 28 లక్షలకు చేరుకుంది. వీటి విలువ మొత్తం రూ. 627 కోట్లకు చేరింది. ‘బయ్ నౌ.. పే లేటర్’ విధానంలో పేటీఎం లోన్లు ఇస్తోంది.
