జగన్ మాఫియాను ఏపీ నుంచి తన్ని తరిమేస్తాం..పవన్ కళ్యాణ్

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారం ప్రారంభించి జనంలో ఉండటంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తుండగా, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, వారాహి విజయయాత్ర పేరుతొ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు, పవన్ ప్రచారాన్ని కూడా ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ప్రచారంలో భాగంగా పి.గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

జగన్ మాఫియాను ఏపీ నుంచి తన్ని తరిమేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.ప్రేమ సీమగా ఉన్న కోనసీమను జగన్ కలహాల, కొట్లాట సీమగా చేశారని మండిపడ్డారు. రాజకీయ దురందురుడు చంద్రబాబు అని కొనియాడారు. కోనసీమలో క్రాప్ హాలిడే రాకుండా చూసుకుంటామని మాటిచ్చారు. కోనసీమకు ఇచ్చిన హామీలను జగన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 2022 జూలైలో జగన్ ఇక్కడ పర్యటించిన సమయంలో రూ. 30 కోట్లు హామీలిచ్చి ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని జనసేనాని అన్నారు.