దేశం కోసం ఏకతాటిపై నడుద్దాం.. మహాయుతితోనే మహారాష్ట్ర అభివృద్ధి: పవన్​ కల్యాణ్​

హైదరాబాద్​, వెలుగు: దేశం కోసం ఏకతాటిపై నడుద్దామని, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమితోనే మహారాష్ట్ర అభివృద్ధి చెందుతుందని జనసేన చీఫ్​, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ అన్నారు. సనాతన ధర్మం కోసం బాల్​ ఠాక్రే పోరాడారని, అన్యాయాలను ఆయన ఎదిరించారని.. ఆయన తనకు స్ఫూర్తి అని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి (మహాయుతి) అభ్యర్థులకు మద్దతుగా పవన్ కల్యాణ్ శనివారం నాందేడ్​ జిల్లా దెగ్లూర్​ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. 

దెగ్లూర్, భోకర్​ ఏరియాల్లో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు. “బాలాసాహెబ్ ఠాక్రేను కలిసే అవకాశం రాలేదు. అన్యాయాలు, అక్రమాలు ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి. ఏ మాత్రం భయపడకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో నాకు ఆయన స్ఫూర్తి” అని తెలిపారు. భారత దేశాన్ని ఐదు లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలకపాత్ర పోషించబోతున్నదని చెప్పారు. మహారాష్ట్ర చరిత్రను చూస్తే ఎంతో మంది సనాతన ధర్మాన్ని రక్షించేందుకు కృషి చేశారని, అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో సాధువులపై దారుణాలు జరిగాయన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని ఆయన సూచించారు.

‘‘మహా వికాస్ అఘాడి కూటమి ప్రజలను విభజించి, పాలించాలని చూస్తున్నది. దాని మాయలో పడి బందీలుగా మారొద్దు. మహారాష్ట్ర అభివృద్ధి పథంలో పయనించాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి. అది కేవలం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమితోనే సాధ్యం” అని తెలిపారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగే సత్తా ఒక్క ప్రధాని మోదీలోనే ఉందని, ఎక్కడ స్థిరతం ఉంటుందో అక్కడ సమర్థ పాలన ఉంటుందని చెప్పారు. కాగా, లాతూర్​లో నిర్వహించిన భారీ రోడ్ షోలోనూ పవన్​ కల్యాణ్​ పాల్గొన్నారు.