ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. ఎన్నికలకు గట్టిగా 50రోజులు కూడా లేకపోవటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార బాట పట్టాయి. ఇప్పటికే సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులు ప్రచారాన్ని ప్రారంభించి జనంలోకి వెళ్లగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు. మార్చి 30నుండి వారాహి విజయయభేరి పేరుతో పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లనున్నాడు. శనివారం ( మర్చి 30) పిఠాపురంలో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు పవన్.
పిఠాపురంలో బహిరంగ సభ తర్వాత సాయంత్రం చేబ్రోలులో సభ నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. తాను పోటీ చేయబోయే స్థానం గురించి చాలా కాలం సస్పెన్స్ కొనసాగించిన పవన్ కళ్యాణ్ ఇటీవలే పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎన్నికలలు సమయం దగ్గరపడుతున్న క్రమంలో పిఠాపురంతో పాటు జనసేన పోటీ చేసే మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రచారం కీలకం కానుంది. మరి, కూటమి గెలుపు కోసం తన పార్టీ స్థానాలను కూడా త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ రకంగా సాగుతుందో వేచి చూడాలి.