ఎట్టకేలకు వారాహి ఎక్కనున్న పవన్..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ చేరింది. 2019 ఎన్నికల్లో లాగే ఈ ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని నమోదు చేయాలని అధికార వైసీపీ భావిస్తుండగా, ఎలా అయినా జగన్ ను ఈసారి గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలు హోరాహోరీగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా తక్కువ సీట్లకే పరిమితమై, తన పార్టీకి కేటాయించిన సీట్లను కూడా బీజేపీ కోసం త్యాగం చేసి జనసేన శ్రేణులను అయోమయంలోకి నెట్టేశాడు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి సిద్ధమవుతున్నాడని సమాచారం అందుతోంది. చాలా కాలం కిందట రాష్ట్రంలో బస్సు యాత్ర కోసం సిద్ధం చేసిన వారాహిని ఎన్నికల ప్రచారానికి వాడనున్నాడని తెలుస్తోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ వారాహి వాహనం మీద జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంత రచ్చ జరిగిన తర్వాత పవన్ వారాహి ఊసు కూడా ఎత్తకపోవటంతో జనసేన శ్రేణులు నిరాశకు లోనయ్యారు.

ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం పవన్ వారాహిని షెడ్డు నుండి బయటకు తీయనున్నారని, వారాహిని సిద్ధం చేయండని తన సిబ్బందికి ఆదేశమిచ్చినట్లు తెలుస్తోంది. వారాహిపై తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలో 20రోజుల పాటు, జనసేన పోటీ చేయనున్న మిగతా 20 నియోజకవర్గాల్లో మరో 20రోజుల పాటు పవన్ ఎన్నికల ప్రచారం సమాచారం. ఎట్టకేలకు జనసేనాని వారాహి వాహనాన్ని బయటకు తీస్తున్నాడన్న వార్తతో జనసైనికుల్లో ఉత్సాహం నెలకొంది.