తన స్థానంపై ఇంకా క్లారిటీ ఇవ్వని పవన్ - అసెంబ్లీ బరిలో లేనట్లేనా..?

2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ రెట్టింపవుతోంది. అధికార వైఎస్సాసీపీ ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించి వరుస బహిరంగ సభలతో దూసుకుపోతోంటే టీడీపీ, జనసేనలు మాత్రం తర్జనభర్జనలు పడుతున్నాయి. తాజాగా టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల తోలి జాబితా పై సర్వత్రా చర్చ మొదలైంది. తొలి జాబితాలో 118స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించగా 94స్థానాల్లో టీడీపీ, 24స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు తెలిపారు.

టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా పవన్ కళ్యాణ్ మాత్రం 5స్థానాలకే అభ్యర్థులను అనౌన్స్ చేశాడు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. పవన్ పరకటించిన 5స్థానాల్లో తాను పోటీ చేయబోయే స్థానం ప్రకటించలేదు. దీంతో, ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ బరిలో నుండి తప్పుకొని పార్లమెంట్ బరిలో పోటీ చేస్తాడా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేయనున్నాడని ప్రచారం జరుగుతుండగా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసాక కూడా క్లారిటీ ఇవ్వకపోవటం పట్ల జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే స్థానాన్ని అనౌన్స్ చేయాలంటే భయపడుతున్నాడని వైసీపీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. మరి జనసేనాని అసెంబ్లీ బరిలో ఉంటాడా లేదా అన్నది తెలియాలంటే తుది జాబితా వచ్చే వరకు వేచి చూడక తప్పదు.