ఎంపీడీఓపై దాడి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓపై దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఎంపీడీఓపై  దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని అన్నారు పవన్ కళ్యాణ్.

ఈ ఘటనపై అధికారులతో చర్చించిన పవన్ ఘటనకు కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎంపీడీవో జవహర్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఈ ఘటనపై విచారణకు ఆదేశిచిన పవన్..  ఎంపీడీవో ఆరోగ్యం గురించి వాకబు చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ALSO READ | ఏపీలో కొత్త ఏడాది జోష్.. ఈ బ్రాండ్లను ఎగబడి కొంటున్న మద్యం ప్రియులు

ఎంపీడీఓపై వైసీపీ నాయకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది.స్థానిక ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి.. ఎంపీపీ రూమ్ తాళాలు ఇవ్వాలని జవహర్ ను కోరగా... ఎంపీపీ లేకుండా తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని నిరాకరించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుదర్శన్ రెడ్డి అనుచరులతో కలిసి ఎంపీడీవోపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.