ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్

  •     పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయింపు 
  •     హోం మంత్రిగా అనిత.. నారా లోకేశ్​కు ఐటీ శాఖ

హైదరాబాద్, వెలుగు :  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్​ పవన్ కల్యాణ్ నియమితులయ్యారు. ఆయనకు ఆ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలను సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు. మిగతా మంత్రులకు కూడా శాఖలను కేటాయిస్తూ శుక్రవారం ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో విడుదల చేశారు. కీలకమైన హోం శాఖను తొలిసారి మంత్రి అయిన వంగలపూడి అనితకు ఇచ్చారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ కేటాయించగా.. టీడీపీ తొలి ప్రభుత్వంలో ఇచ్చినట్టుగానే నారా లోకేశ్ కు ఐటీ, పి. నారాయణకు మున్సిపల్ శాఖ ఇచ్చారు. 

లోకేశ్ కు అదనంగా విద్యా శాఖ కూడా ఇచ్చారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు గనులు, భూగర్భ జల, ఆబ్కారీ శాఖలు కేటాయించారు. అలాగే అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖలు, పి. నారాయణ: మున్సిపల్, పట్టణాభివృద్ధి, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ కేటాయించారు. బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు హెల్త్, జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లైస్, అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ కు సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖలు దక్కాయి. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను సీఎం చంద్రబాబు తన వద్దే పెట్టుకున్నారు.  

డిప్యూటీ సీఎం పోస్ట్ ఒక్కటే  

ఏపీ కొత్త మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం హోదాను పవన్‌ కల్యాణ్‌ కు మాత్రమే సీఎం చంద్రబాబు కేటాయించారు. టీడీపీ తొలి ప్రభుత్వంలో 2014–19 మధ్యలో సీఎంగా ఉన్న ఆయన తన కేబినెట్ లో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు కేటాయించారు. అయితే, ఈసారి కూటమిలో కీలకంగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ తన కేబినెట్ లోకి రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి చంద్రబాబు గౌరవించారని చెప్తున్నారు.