2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ రెట్టింపవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రచార హడావిడి మొదలైంది. ఇప్పటికే మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి అధికార ప్రతిపక్షాలు. ఇదిలా ఉండగా జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి బరిలో దిగుతారన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఆ సస్పెన్స్ కి తెరదించుతూ తాను పోటీ చేసే స్థానాన్ని ప్రకటించాడు పవన్ కళ్యాణ్.
వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు స్వయంగా ప్రకటించాడు పవన్. ఈసారి కూడా పవన్ భీమవరం నుండి పోటీ చేస్తాడని మొదటి నుండి ప్రచారం జరిగింది. అయితే, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు ప్రకటించాడు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయటమే ఇష్టమని, ఎంపీగా పోటీ చేయాలా వద్దా అన్నది పెద్దలు నిర్ణయిస్తాడని అన్నారు. పవన్ కాకినాడ నుండి ఎంపీగా పోటీ చేస్తాడన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరొక సస్పెన్స్ కి తెర లేపాయి.