2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి పేరుతో ప్రచారానికి సన్నద్ధం అయ్యాడు. ఈ క్రమంలో విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానానికి అధికారికంగా అభ్యర్థిని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. వైసీపీ నుండి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్లు ప్రకటించింది జనసేన. వంశీకృష్ణకు విశాఖ సౌత్ టికెట్ కేటాయిస్తారని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఇప్పుడు అధికారిక ప్రకటనతో వంశీకృష్ణకు టికెట్ ఖరారయ్యింది.
పొత్తులో భాగంగా 21అసెంబ్లీ స్థానాలు 2ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన ఇంకా అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ స్థానానికి ఆశావహులు ఎక్కువమంది ఉన్న నేపథ్యంలో సర్వే జరిపిన తర్వాత వచ్చిన ఫలితాన్ని బట్టి అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి,వారాహి విజయభేరి పేరుతో రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేసిన పవన్ ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాడా లేదా వేచి చూడాలి.