మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లారావు కుమారుడు పత్తిపాటి శరత్ ను పోలీసులు రిమాండ్ కి తరలించారు. వేయని రోడ్లకు ప్రభుత్వం నుండి ఇన్ పుట్ ట్యాక్స్ సబ్సిడీ క్రెడిట్ ని పొందినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. శరత్ ను అర్థరాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించి 14రోజుల పాటు రిమాండ్ కి తరలించాలని ఆదేశాలిచ్చారు.
ఈ నేపథ్యంలో జడ్జి ఇంటి ఎదుట అర్థరాత్రి నుండి తెల్లవారుజాము వరకు హైడ్రామా నడిచింది. టీడీపీ నేతలు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహనరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, బోడె ప్రసాద్, పట్టాభిరామ్, పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాస్ తదితరులు తెల్లవారు జాము వరకు జడ్జి ఇంటి ముందే ఉన్నారు.
శరత్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు బెనర్జీ, లక్ష్మీనారాయణ ఒకే తరహా నేరం పై రెండు FIR లు నమోదు చేయటం నిబంధనలకు విరుద్ధమని, ఇదే తరహా కేసు తెలంగాణలో కూడా నమోదయ్యిందని వాదించారు. సెక్షన్ 409 ఈ కేసుకు వర్తించదంటూ తిరస్కరించి రిమాండ్ కి ఆదేశాలిచ్చారు.