అసెంబ్లీలో అల్లు అర్జున్ టాపిక్ గంట సేపు అవసరమా..? పట్నం నరేందర్

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, హీరో అల్లు అర్జున్ కేసుపై బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024, డిసెంబర్ 25న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‎పై అక్రమంగా కేసు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. సంధ్య థియేటర్‎లో జరిగిన ఘటన దురదృష్టకరమని.. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. 

తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీ తేజ్‎ కోలుకునే వరకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్ తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీరు ఆశ్చర్యంగా ఉందని.. అల్లు అర్జున్ అంశంపై గంట సేపు అసెంబ్లీలో మాట్లాడటం అవసరమా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజలు, రైతు సమస్యలపై మాట్లాడాలని.. అది పక్కనపెట్టి జనాలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు.. హీరో అల్లు అర్జున్ ను ఏ11 నిందితుడిగా చేర్చారు. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‎ను పోలీసులు అరెస్ట్ చేయగా.. హై కోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది.