చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్‌ రిలీజ్‌



 

సికింద్రాబాద్, వెలుగు : లగచర్ల కేసులో రిమాండ్‌ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్‌రెడ్డి గురువారం జైలు నుంచి విడుదల అయ్యాడు. నరేందర్‌రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న మరో 24 మందికి నాంపల్లి కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పట్నం నరేందర్‌రెడ్డిని రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, మూడు నెలల పాటు ప్రతి బుధవారం  పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 

నరేందర్‌రెడ్డి విడుదల సందర్భంగా మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. నరేందర్‌రెడ్డి విడుదల కాగానే పటాకులు కాల్చి సంబరాలు చేశారు. అనంతరం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపులకు పోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా కేటీఆర్‌ను సైతం ఇరికించే కుట్ర చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.