మీరన్నదే నిజమైతే వెయ్యి కోట్ల ఫైన్ వేయండి, చావడానికైనా సిద్దమే : రామ్ దేవ్

మీరన్నదే నిజమైతే వెయ్యి కోట్ల ఫైన్ వేయండి, చావడానికైనా సిద్దమే : రామ్ దేవ్

పతంజలి తన ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు వాదనలు చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తాజాగా సుప్రీం వ్యాఖ్యలను పతంజలి అధినేత, యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఖండించారు. దేశ చట్టాన్ని, రాజ్యాంగాన్ని తాను గౌరవిస్తానని ఆయన అన్నారు. ఆయుర్వేదం పేరుతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాము నిజంగానే తప్పుగా ప్రచారం చేస్తున్నట్టు నిరూపిస్తే..  రూ.1000కోట్లు జరిమానా విధించండని రామ్ దేవ్ అన్నారు. మరణశిక్షకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.

నిన్నటి నుంచి వివిధ మీడియా సైట్‌లలో సుప్రీంకోర్టు పతంజలిని మందలించిందని ఒక వార్త వైరల్ అవుతోంది. తప్పుడు ప్రచారం చేస్తే జరిమానా విధిస్తామని సుప్రీం తెలిపింది. ఈ క్రమంలో తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం.. కానీ తాము ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం లేదని రామ్ దేవ్ చెప్పుకొచ్చారు. కొంతమంది డాక్టర్లు.. యోగా, ఆయుర్వేదం అంటూ తప్పుడు ప్రచారం చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తాము నిజంగా అబద్ధాలకోరు అయితే వెయ్యి కోట్లు జరిమానా విధించండని, మరణశిక్షకు కూడా సిద్ధమేనని ఆయన వెల్లడించారు.

యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, మన సనాతన విలువలకు వ్యతిరేకంగా కొందరు వైద్యుల బృందం ప్రచారం చేస్తోందని, రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, కీళ్లనొప్పులు, కాలేయ వ్యాధి, కిడ్నీ ఫెయిల్యూర్, వంటి వ్యాధులకు ప్రపంచంలో పరిష్కారం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని యోగా గురువు అన్నారు.