కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ ను తప్పనిసరి చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది, ప్రయాణం మొత్తం తప్పకుండా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. మాస్క్ లేకుంటే ఎయిర్‌పోర్టులోకి ఎవ్వరిని అనుమతించొద్దని, ఒకవేళ విమానం ఎక్కిన తర్వాత కూడా మాస్క్ ధరించేందుకు నిరాకరిస్తే, కిందికి దింపేయొచ్చని సూచించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్‌కు డీజీసీఏ మార్గదర్శకాలు పంపింది. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని, కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆరోగ్య మంత్రిత్వ శాఖ, లేదా డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. కోర్టు ఆదేశించిన మరుసటి రోజే డీజీసీఏ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మరోవైపు దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా 5,233 కేసులు నమోదయ్యాయి.
