నడిగడ్డలో భారీ వర్షం .. ఇబ్బంది పడ్డ ప్రయాణికులు

  • రెండు గంటలపాటు  స్తంభించిన జనజీవనం
  • పిడుగుపాటుకు ఎద్దు మృతి

గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడడంతో  ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల పాటు భారీవర్షం పడడంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ఇటిక్యాల మండలం ఊదండపురంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ వేపచెట్టు నేలకూలింది. చెట్టు పక్కకు పడడంతో సమీపంలో ఉన్న దేవుడి రథానికి పెను ప్రమాదం తప్పింది. క్రీడా ప్రాంగణం వద్ద ట్రాన్స్​ఫార్మర్ స్తంభాలు విరిగిపడి సరఫరా నిలిచిపోయింది. 

అయిజ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. 19 వ వార్డులో డ్రైనేజీ పొంగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం గ్రామ సమీపంలో రోడ్డుపై చెట్టు కూలిపోవడంతో గద్వాల నుంచి హైదరాబాద్ కు, కర్నూలు నుంచి గద్వాలకు వచ్చే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. గద్వాల మండలంలోని జమ్మిచేడు లో వడగండ్ల వర్షం కురిసింది. బిరెల్లి కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన రైతు బోయ తిమ్మప్ప వడ్లు కొన్ని నానిపోయి, మరికొంత కొట్టుకుపోయాయి.  గట్టు మండల కేంద్రంలో పిడుగుపాటుకు కోలంట్ల తిమ్మన్న ఎద్దు మృతి చెందడంతో బాధితులు కన్నీటి 
పర్యంతమయ్యారు.