- కేంద్ర మంత్రి పదవికి పశుపతి పరాస్ రిజైన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల వేళ బిహార్లో ఎన్డీఏ కూటమికి షాక్ తగిలింది. బిహార్ లో ప్రాంతీయ పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) చీఫ్ పశుపతి పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేగాక, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి తన పార్టీని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. బిహార్ లో ఎన్డీఏ కూటమి.. పశుపతి పరాస్ అన్నకొడుకు చిరాగ్ పాశ్వాన్‌కి చెందిన లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్)కి ఐదు సీట్లను కేటాయించింది.
కూటమిలో భాగమైన ఆర్‌ఎల్‌జేపీకి ఒక్కసీటు కూడా అలాట్ చేయలేదు. అంతేగాక, 2019 ఎన్నికల్లో పరాస్ గెలిచిన హాజీపూర్ నియోజకవర్గాన్ని కూడా అతనితో చర్చించకుండానే చిరాగ్ పాశ్వాన్‌కి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పరాస్ తనపదవికి రిజైన్ చేయడంతో పాటు ఎన్డీఏ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా అనంతరం పరాస్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.." నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాను.
సీట్ల పంపకంలో మా పార్టీకి, నాకు అన్యాయం జరిగింది. ఎన్డీఏలో నేను నిజాయితీతో, భక్తితో పనిచేశాను. అయినా మాకు అన్యాయం జరిగింది. దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మోదీకి థ్యాంక్స్" అని పరాస్ చెప్పారు. హాజీపూర్ స్థానం నుంచి ఆర్‌ఎల్‌జేపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. పార్టీ నేతలతో త్వరలో సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
2020లో రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ బాధ్యతలు చేపట్టారు. అది నచ్చని రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ 2021లో చిరాగ్ పాశ్వా న్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. నలుగురు ఎల్జేపీ ఎంపీలతో కలిసి బయటకు వచ్చేశారు. దీంతో ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
