- డెమోక్రసీతోనే సామాన్యుల కలలు సాకారం: ఉత్తమ్
- ప్రజాస్వామ్య రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
- ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్‌లో మంత్రి గెస్ట్ లెక్చర్
హైదరాబాద్, వెలుగు: దేశ ప్రజల సాధికారతకు, అభివృద్ధికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మూలమని ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్ శాఖల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సామాన్యుల కలల సాకారానికి ప్రజాస్వామ్య వ్యవస్థే ఒక పునాది వంటిదన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) అహ్మదాబాద్ ఆహ్వానం మేరకు మంత్రి ఈ మేరకు ఆదివారం ఇనిస్టిట్యూట్ క్యాంపస్ లో గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలెట్ గా పని చేయడం, తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వర్తించడం, అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజా సేవలో కొనసాగుతుండటంపై ఆయన ఈ సందర్భంగా వివరించారు.
భారత్ లో 77 ఏండ్లుగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, కానీ పొరుగు దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పెద్దగా పురోగతి సాధించలేదన్నారు. తనతో సహా కోట్లాది మంది పురోగతికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే దోహదం చేసిందన్నారు. అందుకే ఈ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. విలువలకు కట్టుబడి ఉంటూ, కష్టపడి పని చేయాలని.. అలా చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని విద్యార్థులకు మంత్రి సూచించారు. “ఓటములు విజయానికి సోపానాలు. ఎదురుదెబ్బలతో నిరుత్సాహపడవద్దు” అని చెప్పారు.
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బిజినెస్ స్కూల్‌గా ఐఐఎం అహ్మదాబాద్ పేరు పొందిందని, ఎంతో మందిని కార్పొరేట్ లీడర్‌లుగా అత్యున్నత స్థాయికి తీర్చిదిద్దిన ఘనత ఈ సంస్థకు దక్కుతుందని ప్రశంసించారు. అయితే, చదువులు, ఉద్యోగాలు, ప్రజా సేవ.. వంటివి ఏవైనా స్థిరత్వం ఉండాలన్నారు. ‘‘నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో క్యాడెట్‌గా కెరీర్ ప్రారంభించాను. ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలట్‌గా మిగ్ 21, మిగ్ 23 జెట్‌లను నడిపాను.
ఫ్రంట్‌లైన్ స్క్వాడ్రన్‌లలో సైతం పని చేశాను” అని ఉత్తమ్ వాయుసేనలో తన కెరీర్ గురించి తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతులు ఆర్.వెంకట్రామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ఆధ్వర్యంలో సీనియర్ అధికారిగా కూడా పని చేశానని చెప్పారు. ఇద్దరు ప్రెసిడెంట్లకు సేవ చేయడం ఒక ప్రత్యేకమైన అనుభవమని తెలిపారు. దేశ అత్యున్నత కార్యాలయం పాలనా తీరుపై తనకు లోతైన అవగాహన ఇచ్చిందని తెలిపారు.
ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి..
ప్రజలకు నేరుగా సేవ చేయాలనే ఆలోచనతోనే1994లో కాంగ్రెస్ లో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్టు ఉత్తమ్ వెల్లడించారు. మొదటిసారి కోదాడలో పోటీ చేసి ఓడిపోయానని, ఇది చేదు అనుభవమైనా తనలో పట్టుదలను పెంచిందన్నారు. ఆ తర్వాత కూడా ప్రజల కోసం పని చేస్తూ 1999లో కోదాడ నుంచే ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. తర్వాత హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా, నల్గొండ ఎంపీగా కూడా గెలిచానన్నారు. వీటిలో ప్రతి గెలుపూ ప్రజలతో తనకు ఉన్న అనుబంధానికి నిదర్శనమన్నారు.
2015 నుంచి 2021 వరకూ తెలంగాణ పీసీసీ చీఫ్ గా జాతీయ స్థాయి చర్చల్లో పాల్గొన్నానని, ప్రతి వేదికా తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచిందన్నారు. ఉమ్మడి ఏపీలో హౌసింగ్ మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్ మంత్రిగా ఉన్నానని.. ఏ బాధ్యత చేపట్టినా రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నాన్నారు.