అంబేద్కర్పై అమిత్ షా మాట్లాడిన అవమానకర మాటలు ఇవే

 రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడారంటూ  దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. అమిత్ షాను వెంటనే బర్త్ రఫ్ చేయాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి.  అమిత్ షా  క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు జై భీమ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

 పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు ప్రియాంక, కూటమి పార్టీల ఎంపీలు ధర్నా చేశారు. తెలంగాణ నుంచి ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్​ కుమార్​రెడ్డి, ఇతర ఎంపీలు హాజరయ్యారు. లోక్ సభ లాబీ బయట అంబేద్కర్ చిత్ర పటంతో ఖర్గే, ఎంపీ గడ్డం వంశీకృష్ణలతో పాటు ఎంపీలు నిరసన తెలిపారు.

బాబా సాహెబ్ అంబేద్కర్​ను అవమానిస్తే దేశం సహించబోదని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కు, ఆయన ఐడియాలజీకి, రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమని అన్నారు. ‘‘బాబా సాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత. దేశానికి మార్గం చూపిన మహనీయుడు. ఆయనకు గానీ, ఆయన రూపొందించిన రాజ్యాంగానికి గానీ అవమానం జరిగితే దేశం సహించబోదన్నారు. 

Also Read :- రూల్స్ ప్రకారం నడుచుకోండి.. స్లోగన్స్ చేయొద్దు

 అంబేద్కర్​పై ప్రధాని నరేంద్ర మోదీకి ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు మల్లికార్జున ఖర్గే. అంబేద్కర్ పేరుతోనే హక్కులు పొందుతామని, ఆయన పేరు చెప్పుకోవడం కోట్లాదిమంది దళితులు, అణగారిన వర్గాల ఆత్మ గౌరవానికి ప్రతీక అని  ఎంపీ ప్రియాంక గాంధీ ఎక్స్​లో స్పందించారు.

అటు  అమిత్ షా చేసిన వ్యాఖ్యలకుగాను రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్‌‌ ఒ‌‌బ్రియెన్‌‌ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్‌‌ మోషన్‌‌) నోటీసు ఇచ్చారు. రాజ్యసభ విధి విధానాలు, ప్రవర్తనా నియమావళిలోని రూల్ 187 కింద ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఫైల్ చేశారు.

అమిత్ షా ఏమన్నారంటే..

రాజ్యాంగంపై చర్చ సందర్బంగా రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా.. ఈ మధ్య  అంబేద్కర్..అంబేద్కర్..అంబేద్కర్ అని అనడం ఫ్యాషన్ అయింది.  ప్రతిపక్షాలు తరచూ దేవుడి పేరు స్మరించి ఉంటే స్వర్గానికి చేరుకునేవారని కేంద్ర హోంమంత్రి షా అన్నారు. వెంటనే అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పడింది. బీజేపీకి అంబేద్కర్ పై ఎలాంటి దురుద్దేశం ఉందో అర్థమవుతోందన్నారు. 

మరో వైపు తన వ్యాఖ్యలను వక్రీకరించారని అమిత్ షా బదులిచ్చారు. ‘‘నేనెప్పుడూ అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది. ఆ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది. నా స్పీచ్ ను ఎడిట్ చేసి ప్రజలకు షేర్ చేస్తున్నది. నా స్పీచ్ మొత్తం వినాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు నిజమేంటో అర్థమవుతుంది” అని అమిత్ షా అన్నారు. కలలో కూడా అంబేద్కర్ ను కించపరచని పార్టీ నుంచి తాను వచ్చానని చెప్పారు. తన స్పీచ్ ను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్న కాంగ్రెస్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.