- మాస్టర్ మైండ్ లలిత్‌కు హెల్ప్ చేసిన మహేశ్ కుమావత్
- ఇద్దరూ కలిసే సెల్ఫోన్లను కాల్చేశారని ఆరోపణలు
- 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ : పార్లమెంట్ లో స్మోక్ అటాక్ ఘటనకు సంబంధించిన కేసులో ఆరో నిందితుడు మహేశ్ కుమావత్ ను శనివారం అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా 7 రోజుల కస్టడీకి అప్పగించినట్లు వెల్లడించారు. స్మోక్ అటాక్ కేసులో సూత్రధారి అయిన లలిత్ ఝా ఢిల్లీ నుంచి పారిపోయేందుకు, నిందితుల సెల్ ఫోన్లను కాల్చేసి ఆధారాలను నాశనం చేసేందుకు మహేశ్ సాయం చేశాడని తెలిపారు. లలిత్ తో పాటు మహేశ్ కూడా గురువారం రాత్రే పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారని, అయితే.. అప్పటినుంచి పూర్తిగా విచారణ చేసిన తర్వాతే మహేశ్ ను అరెస్ట్ చేశామన్నారు. ఇతను కూడా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేజీలో మెంబర్ గా ఉన్నాడన్నారు. ఇతడిని సాక్ష్యాధారాల నాశనం, నేరపూరిత కుట్ర అభియోగాలతో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. దేశంలో అరాచకత్వం రేపేందుకు వీరు కుట్రపన్నారని, దీనిని పూర్తిస్థాయిలో వెలికితీసేందుకు నిందితులను కస్టడీకి తీసుకున్నామన్నారు. కాగా, బుధవారం లోక్ సభలోకి విజిటర్స్ గా వెళ్లిన సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు యువకులు స్మోక్ క్యాన్ లు ఓపెన్ చేసి పొగను వదులుతూ, నినాదాలు చేస్తూ ఎంపీలను భయభ్రాంతులకు గురిచేశారు. అదేసమయంలో పార్లమెంట్ బయట నీలమ్ దేవి, అమోల్ షిండే అనే మరో ఇద్దరు కలర్ పొగ వదులుతూ నినాదాలు చేశారు. ఈ ఘటనను వీడియో తీసిన లలిత్ ఝా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఐదుగురిని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేయగా కోర్టు 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో మాస్టర్ మైండ్ లలిత్ ఝా పశ్చిమ బెంగాల్ కు చెందినవాడని, అతడికి ఇండియా కూటమిలో భాగస్వామి అయిన తృణమూల్ కాంగ్రెస్ నేతలతో లింకులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
మా కొడుకు తప్పు చేయడు: లలిత్ ఝా పేరెంట్స్
తమ కొడుకు లలిత్ లోక్ సభలో స్మోక్ అటాక్ కేసులో నిందితుడిగా ఉండటాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని అతడి తండ్రి దేవానంద్ ఝా, తల్లి మంజుల చెప్పారు. ‘‘లలిత్ చెడ్డవాడు కాదు. ఇతరు లకు ఎప్పుడూ సాయం చేసేవాడు. అతను ఎలాంటి తప్పు చేయడు” అని వారు మీడియాకు తెలిపారు. అతడిపై కఠినమైన యూఏపీఏ చట్టం కింద కేసు పెట్టారని తెలిసిందని కన్నీరుపెట్టుకున్నారు. కోర్టు తన బిడ్డపై కరుణ చూపాలని కోరారు.
