పెట్రోల్, డీజిల్ ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్

పెట్రోల్, డీజిల్ ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్

వరుసగా రెండో రోజూ పార్లమెంట్ లో రచ్చ జరిగింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలపై సభలను అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, BSP MP సతీశ్ చంద్ర మిశ్రాలు బిజినెస్ సస్పెండ్ చేయాలని నోటీసిచ్చారు. సభ ప్రారంభం కాగానే పెట్రో, వంట గ్యాస్ ధరలపై చర్చకు పట్టుబట్టారు. 

పెట్రోల్, డీజిల్ లను GST పరిధిలోకి తీసుకురావాలటే GST కౌన్సిల్ రికమండేషన్ తప్పనిసరి అన్నారు కేంద్ర ఆర్థిక శాఖా సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్. అయితే కౌన్సిల్ ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ను GSTలోకి చేర్చే విషయంలో రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు అనురాగ్ ఠాకూర్.  
 
అటు లోక్ సభలోనూ గందరగోళం కొనసాగింది. గందరగోళం మధ్యే సభను కొనసాగించేందుకు ప్రయత్నించారు స్పీకర్. క్వశ్చన్ అవర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సెటైర్లేశారు పశుసంవర్థక శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్. రాహుల్ గాంధీని స్కూల్ కు పంపించాలన్నారు. మత్స్య రంగానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలన్న రాహుల్ మాటలపై స్పందించిన గిరిరాజ్... రాహుల్ మెమరీ ఫెయిల్ అయిందన్నారు.

చర్చ కొనసాగించేందుకు స్పీకర్ ప్రయత్నించినా... పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలపై విపక్షాల ఆందోళనతో సభ జరగలేదు. తమ వాయిదా తీర్మానంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభ మొదటిసారి 12గంటలకు వాయిదా పడింది. తర్వాత 2గంటలకు ఆ తర్వాత బుధవారానికి వాయిదా పడింది.