Rishabh Pant: ప్రమాదం నుంచి కాపాడిన వారికి స్కూటీలు బహుమతిగా ఇచ్చిన పంత్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30 న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్కు వెళ్తుండగా..రూర్కి వద్ద పంత్ కారు ప్రమాదానికి గురైంది. కారు రోడ్డు పక్కన రెయిలింగ్ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి  పూర్తిగా దగ్ధమైంది. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పంత్..కారు అద్దాలు పగులకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. రజత్, నిషు అనే ఇద్దరు వ్యక్తులు ప్రమాదం నుంచి కాపాడారు. 

ఆ తర్వాత పంత్ ఈ ఇద్దరు వ్యక్తులు చేసిన మేలుకు కృతజ్ఞతగా టూ వీలర్ స్కూటీని గిఫ్ట్ గా అందించాడు. తాజాగా ఒక జర్నలిస్ట్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ వీడియోలో జర్నలిస్ట్ భరత్ సుందర్‌సేన్ ఇద్దరు వ్యక్తులను పలకరించి పంత్ గురించి అడిగినట్టు తెలుస్తుంది. స్కూటీ మీద రిషబ్ పంత్ అని పేరు రాసి ఉంది. రోడ్ ప్రమాదం తర్వాత దాదాపు 18 నెలల పాటు పంత్ క్రికెట్ కు దూరమయ్యాడు. 

2024 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రీ ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రాణించాడు. ఇదే క్రమంలో 2024 టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం పంత్ ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ఆడుతున్నాడు. బౌలింగ్ అనుకూలించిన పెర్త్ పిచ్ పై తొలి ఇన్నింగ్స్ లో 37 పరుగులు చేసి రాణించాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ రిలీజ్ చేయగా ఆదివారం (నవంబర్ 24) జరగబోయే మెగా వేలంలో ఫ్రాంచైజీల దృష్టి మొత్తం పంత్ పైనే ఉంది.