GST 2 శ్లాబులు చాలు..నిపుణుల కమిటీ సూచన

GST 2 శ్లాబులు చాలు..నిపుణుల కమిటీ సూచన

ముంబై/న్యూఢిల్లీజీఎస్‌‌టీ శ్లాబులు ఇప్పుడున్న 4 నుంచి 2 కి తగ్గే సూచనలున్నాయి. జీఎస్‌‌టీ వసూళ్ల టార్గెట్‌‌ను అందుకోలేకపోతున్న నేపథ్యంలో స్టడీకి కేంద్ర, రాష్ట్రాల అధికారులతో వేసిన   నిపుణుల కమిటీ  ఈ సూచన చేసింది. శ్లాబులు తగ్గించడం వల్ల జీఎస్‌‌టీ విధానం మరింత సులభతరమవుతుందని కూడా  ఆ కమిటీ చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే జీఎస్‌‌టీ వసూళ్లలో రూ.63,200 కోట్ల మేర గండి పడుతుందని, ఇది 2021 నాటికి మరింత పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందని కమిటీ అంచనా వేస్తోంది.

జీఎస్‌‌టీ విధానాన్ని పరిశీలించిన ఈ కమిటీ రెండే శ్లాబులు 10 శాతం, 20 శాతం ఉంటే మేలని అభిప్రాయపడుతోంది. ఇప్పటిదాకా 18 శాతం శ్లాబులో ఉన్న కొన్నింటిని 28 శాతం శ్లాబులోకి మార్చేయొచ్చని పేర్కొంది. ఈ నిపుణుల కమిటీ  బీహార్‌‌ డిప్యూటీ సీఎం సుశీల్‌‌ మోడికి ఒక ప్రజంటేషన్‌‌ ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెవెన్యూ పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌ మోడిని కోరింది. ఐజీఎస్‌‌టీపై ఏర్పాటైన గ్రూప్‌‌ ఆఫ్‌‌ మినిస్టర్స్‌‌ (జీఓఎం)కు సుశీల్‌‌ మోడి హెడ్‌‌గా ఉన్నారు. స్లోడౌన్‌‌ కారణంగా రెవెన్యూ తగ్గిందని, కాకపోతే జీఎస్‌‌టీ రేట్లను ఇప్పుడు మార్చడం సరైనది కాదని మోడి జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో చెప్పారు. ఒక్క రేటును కూడా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మోడి స్పష్టం చేశారు.

జీఎస్‌‌టీలోని 23 ఐటమ్స్‌‌ మీద పన్ను విధింపు పద్ధతి సరిగా లేదని నిపుణుల కమిటీ హైలైట్‌‌ చేసింది. ఈ ఐటమ్స్‌‌ విషయంలో ఫినిష్డ్‌‌ ప్రొడక్ట్స్‌‌ కంటే  ఇన్‌‌పుట్స్‌‌పై ఎక్కువ జీఎస్‌‌టీ ఉందని ప్రస్తావించింది. మొబైల్‌‌ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్‌‌, మేన్‌‌మేడ్‌‌ యార్న్‌‌, రెడీమేడ్‌‌ గార్మెంట్స్‌‌, ఫెర్టిలైజర్‌‌, ఫ్యాబ్రిక్స్‌‌, రెన్యువబుల్‌‌ ఎనర్జీ ఎక్విప్‌‌మెంట్‌‌ వంటివి 5 శాతం, 12 శాతం శ్లాబులలో ఉన్నాయని, కొన్నింటికి పైన చెప్పినట్లుగా ఇన్వర్టెడ్‌‌ డ్యూటీ స్ట్రక్చర్‌‌ ఇబ్బందిగా ఉందని కమిటీ అభిప్రాయపడింది. దాంతో ఐటీసీ కింద మొత్తం రూ. 20 వేల కోట్లు రిఫండ్‌‌ చేయాల్సి వచ్చినట్లు వివరించింది.

సెల్‌‌ ఫోన్లు, మినరల్స్‌‌, ఫెర్టిలైజర్స్‌‌, టెక్స్‌‌టైల్స్‌‌, షూస్‌‌ వంటి వస్తువులు ఇన్వర్టెడ్‌‌ డ్యూటీ స్ట్రక్చర్‌‌ సమస్య ఎదుర్కొంటున్నాయని, వాటిలో ఫినిష్డ్‌‌ ప్రొడక్ట్స్‌‌పై 5% లేదా 12% జీఎస్‌‌టీ విధిస్తుంటే, చాలా ఇన్‌‌పుట్స్‌‌పై మాత్రం 18% జీఎస్‌‌టీ విధిస్తున్నారని పీడబ్ల్యూసీ ఇండైరెక్ట్‌‌ ట్యాక్సెస్‌‌ లీడర్‌‌ ప్రతీక్‌‌ జైన్‌‌ వివరించారు. గతంలో కొన్ని వస్తువులపై జీఎస్‌‌టీని 28%నుంచి 18%కి తగ్గించారు. ఇప్పుడు దానిని రివర్స్‌‌ చేయాలని కమిటీ సూచిస్తోంది. హై ఎండ్‌‌ హెల్త్‌‌కేర్‌‌, ఎడ్యుకేషన్‌‌ సహా మరి కొన్నింటిపై ఎగ్జంప్షన్‌‌ను తొలగించాలనీ చెబుతోంది. బంగారం వంటి విలువైన మెటల్స్‌‌పై జీఎస్‌‌టీ రేటును ఇప్పుడున్న 3 నుంచి 5 శాతానికి పెంచాలనీ పేర్కొంటోంది. గత ఏడాది జులై నెలలో పెయింట్స్‌‌తోపాటు చాలా కన్స్యూమర్‌‌ డ్యూరబుల్స్‌‌ మీద జీఎస్‌‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి కౌన్సిల్‌‌ తగ్గించిన విషయం తెలిసిందే.

జీఎస్‌‌టీ ఎగవేత అరికట్టడంతోపాటు, కలెక్షన్స్‌‌ పెరిగేలా చర్యలు ఉండాలని రాష్ట్రాలు కోరుతున్నాయని ఈవై ఇండైరెక్ట్‌‌ ట్యాక్సెస్‌‌ లీడర్‌‌ ఉదయ్‌‌ పింప్రికర్‌‌ చెప్పారు. జీఎస్‌‌టీ రేట్లు పెంచితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నా, స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది సరిపోకపోవచ్చని కొంత మంది అభిప్రాయపడ్డారు.ఇప్పుడు అమలవుతున్న జీఎస్‌‌టీ విధానం కింద చాలా వస్తువులపై పన్ను రేటు గతంలోని విధానంతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని, కాకపోతే వివిధ రంగాలలో స్లోడౌన్‌‌ వల్లే కలెక్షన్స్‌‌ పెరగడం లేదని డెలాయిట్‌‌ ఇండియా పార్ట్‌‌నర్‌‌ ఎం ఎస్‌‌ మణి చెప్పారు. నిపుణుల కమిటీ రికమెండేషన్స్‌‌ను వచ్చే కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జీఎస్‌‌టీ అమలులో మార్పులను ఆచి, తూచి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పన్ను ఎగవేతకు దారితీసేలా విధానాలు ఉండకూడదని, బీటూసీ సప్లై మీద 28% పన్ను విధిస్తున్నా, ఇన్‌‌పుట్‌‌ ట్యాక్స్‌‌ క్రెడిట్‌‌ ఇవ్వకపోవడం సరైనది కాదని పింప్రికర్‌‌ వ్యాఖ్యానించారు.

తరచుగా రేట్లు మార్చకూడదు..

ఇదిలా ఉంటే, మరోవైపు నీతి ఆయోగ్‌‌ మెంబర్ రమేష్‌‌ చాంద్‌‌ కూడా జీఎస్‌‌టీ శ్లాబులు రెండే ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో 5, 12, 18, 28 శాతంగా నాలుగు జీఎస్‌‌టీ శ్లాబులున్నాయి. కొన్ని వస్తువులపై మినహాయింపు ఉండగా, అయిదింటిపై సెస్‌‌ కూడా విధిస్తున్నారు. ఎక్కువ శ్లాబులు ఉండటం మంచిదికాదని, జీఎస్‌‌టీ రేట్లను మార్చాలనుకుంటే ఏడాదికి ఒకసారే అలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. జులై 1, 2017 నుంచి జీఎస్‌‌టీ అమలులోకి వచ్చిన తర్వాత, చాలా సార్లు పన్ను రేట్లను మార్చారు. జీఎస్‌‌టీ  వంటి పన్ను సంస్కరణలను కొత్తగా అమలులోకి తెచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవడం సాధారణమేనని రమేష్‌‌ చాంద్‌‌ పేర్కొన్నారు.

జీఎస్‌‌టీ విధానం స్థిరపడటానికి ఇతర దేశాలలోనూ ఎక్కువ టైమే పట్టిందని చెప్పారు.  ప్రాసెస్డ్‌‌ ఫుడ్‌‌, డెయిరీ వంటి వ్యవసాయ ప్రొడక్ట్స్‌‌పై 5 శాతం జీఎస్‌‌టీ సమంజసమేనని చాంద్‌‌ అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలూ జీఎస్‌‌టీ రేట్లను తగ్గించాలనే కోరుతున్నాయని, అది సరైనది కాదని పేర్కొన్నారు.