జీపీలుగా ఉంటాయా.. విలీనమవుతాయా..

  • 22 గ్రామాల ఓటరు జాబితాలు పెండింగ్​
  • ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూపులు

సిద్దిపేట, వెలుగు: మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురైన తొగుట, కొండపాక మండలాల్లోని ఏడు గ్రామ పంచాయతీలు మున్సిపాల్టీలో విలీనమవుతాయా లేదా పంచాయతీలుగానే  కొనసాగుతాయా అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టడంతో సెప్టెంబర్ 29న జిల్లాలోని 477 గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలను అధికారులు విడుదల చేశారు. 

కానీ ఏడు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలతో పాటు సిద్దిపేట రూరల్​మండలంలోని 15 గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం 22 జీపీ ఓటరు జాబితాలను పెండింగ్ లో పెట్టారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలోని సంగాపూర్, ముట్రాజ్ పల్లిలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీకి రెండేళ్ల కింద తరలించారు.

వాటి కార్యకలాపాలు అక్కడే కొనసాగుతున్నాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో తొగుట మండలంలోని వేములఘట్, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇవి ఆర్అండ్ఆర్ కాలనీలో కొనసాగుతుండగా పంచాయతీల పేరిట ఓటరు జాబితా విడుదల చేస్తే కొత్త సమస్య ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

ఇదిలా ఉంటే ఈ ఏడు గ్రామ పంచాయతీలను గజ్వేల్ మున్సిపాల్టీలో ప్రభుత్వం విలీనం చేస్తోందనే ప్రచారం జరిగినా ఆ దిశగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని కమిషనర్ నర్సయ్య తెలిపారు. ఏడు ముంపు గ్రామాల పరిధిలో దాదాపు 12 వేల పై చిలుకు ఓటర్లుండగా  పంచాయతీల పేరిట జాబితాలు విడుదల చేస్తే  కోర్టుకు వెళ్లే అవకాశం ఉండడంతో ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సిద్దిపేట మండల జాబితా పెండింగ్

సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను సిద్ధం చేసినా గెజిట్​లో దీని పేరు లేపోవడంతో అప్ లోడ్ చేసే విషయంలో టెక్నికల్ సమస్య ఏర్పడి అధికారులు పెండింగ్ లో పెట్టారు. ఈ మండలంలో మొత్తం14  గ్రామాలు ఉండగా, కొత్తగా బచ్చయపల్లి గ్రామ పంచాయతీతో వీటి సంఖ్య 15 కు చేరింది. 

ఈ గ్రామాల్లో140 వార్డులతో కలిపి  మొత్తం 22,565 మంది ఓటర్లుండగా  అందులో 11,420 మంది పురుషులు, 11,145 మంది మహిళలు ఉన్నారు. ఇదిలా ఉంటే జీపీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా 22 గ్రామ పంచాయతీల ఓటరు జాబితాపై స్పష్టత రాకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది.