ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్‌‌‌‌ ఏఈ

  • బిల్లు మంజూరు చేసేందుకు రూ. లక్ష డిమాండ్‌‌‌‌
  • రూ. 50 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

గద్వాల, వెలుగు : బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్‌‌‌‌ చేసిన పంచాయతీరాజ్‌‌‌‌ ఏఈ ఏసీబీ ఆఫీసర్లకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని రాజశ్రీగార్లపాడు గ్రామంలో షాదీఖానా నిర్మాణానికి రూ. 35 లక్షలు మంజూరు అయ్యాయి. కాంట్రాక్టర్లు జగదీశ్వర్‌‌‌‌రెడ్డి, లక్ష్మీనారాయణ, లాల్‌‌‌‌బాషా షాదీఖానా బిల్డింగ్‌‌‌‌ నిర్మాణ పనులను చేపట్టారు. గతంలో రూ. 10 లక్షల బిల్లు అయింది.

మిగతా రూ. 25 లక్షల పనులు కూడా కంప్లీట్‌‌‌‌ కావడంతో బిల్లులు చేయాలని పంచాయతీ రాజ్‌‌‌‌ ఏఈ పాండురంగారావును సంప్రదించారు. బిల్లు కంప్లీట్‌‌‌‌ చేసేందుకు రూ. లక్ష ఇవ్వాలని ఏఈ డిమాండ్‌‌‌‌ చేశారు. అయితే రూ. 50 వేలు ఇస్తామని కాంట్రాక్టర్లు చెప్పినా ఏఈ వినకపోవడంతో చివరకు రూ. లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తర్వాత ఏసీబీ ఆఫీసర్లను సంప్రదించారు.

వారి సూచన మేరకు సోమవారం ఎర్రవల్లి చౌరస్తాలోని జాంజాం హోంనీడ్స్‌‌‌‌లో కాంట్రాక్టర్లు ఏఈకి రూ. 50 వేలు ఇచ్చారు. అక్కడే ఉన్న ఏసీబీ ఆఫీసర్లు వెంటనే దాడి చేసి ఏఈ పాండురంగారావును రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌‌‌‌ తెలిపారు. దాడుల్లో సీఐ లింగస్వామి, జిలాని, పోలీస్‌‌‌‌ సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ రాజ్‌‌‌‌ ఏఈ పాండురంగారావు గతేడాది కూడా ఏసీబీ ఆఫీసర్లకు చిక్కారు.