పంచాయతీ ఎన్నికలకు కసరత్తు షురూ..

  • వార్డుల వారీగా ఓటర్​ లిస్టు రూపకల్పన
  • ఎంపీడీవో, ఎంపీవో​, ఆపరేటర్లకు ముగిసిన ట్రైనింగ్
  • ఎన్నికల సిబ్బంది కోసం సీఈసీ నుంచి శిక్షణ బుక్స్​​

నిజామాబాద్​, వెలుగు:  గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహణ, ఓటర్ లిస్టు రూపకల్పన, వార్డుల విభజనపై జిల్లా ఆఫీసర్లు దృష్టి సారించారు. ఆగస్టు 3న హైదరాబాద్ లో నిర్వహించిన ట్రైనింగ్ కు  జిల్లా నుంచి ఇద్దరు ఎంపీవోలు, డీపీఎం, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు వెళ్లారు.  వారి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలందరికీ గత వారం ట్రైనింగ్ కూడా​ఇచ్చారు.  అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల ఓటర్​ లిస్టును ప్రామాణికంగా కొత్త జాబితా ప్రిపేర్​ చేయాలని డీపీవో తరుణ్​కుమార్​ మండల ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. 

అభ్యంతరాలు తెలుసుకోవడానికి లిస్టును పంచాయతీల్లో  ప్రదర్శించనున్నారు. సిబ్బందికి ఇవ్వాల్సిన ట్రైనింగ్​పై ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. గవర్నమెంట్​ నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్త ఓటర్​ పేర్లు నమోదు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్​​కు గవర్నమెంట్​ ఆమోదం తెలిపినందున స్టేట్​ఎలక్షన్​కమిషన్​ అలర్ట్​ అయింది. ఎలక్షన్​ సిబ్బందికి ఇవ్వాల్సిన ట్రైనింగ్​కు చెందిన బుక్స్​ను డీపీవో ఆఫీస్​కు చేరాయి.

పెరిగిన పంచాయతీలు

జిల్లాలో 530 గ్రామ పంచాయతీలుండగా 2019లో 528 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇందల్వాయి, తిర్మన్​పల్లి గ్రామస్తులు  సర్పంచ్​ రిజర్వేషన్​ను వ్యతిరేకిస్తూ ఎన్నికలు బహిష్కరించారు.  గడిచిన ఐదేండ్లు ఆ రెండు విలేజ్​లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింది.  మిగితా 528 గ్రామ పంచాయతీల పదవీ కాలం మొన్నటి ఫిబ్రవరి 1న ముగిసింది. ​ అక్కడ స్పెషల్​ ఆఫీసర్ల పాలన మొదలై ఏడు నెలలు దాటింది. 

పాలకులు లేక ఫండ్స్​ కేటాయింపులో సమస్యలు వస్తున్నందున ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో గవర్నమెంట్​ ఉంది.  గత వారం జిల్లాలో మరో 15  కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తూ గెజిట్​ విడుదలైంది.  దీంతో మొత్తం పంచాయతీల సంఖ్య ఇప్పుడు 545కు చేరింది. వార్డుల సంఖ్య పాతవి 4,932 కాగా కొత్త పంచాయతీల్లో  109 పెరగ్గా..  5,041కు వృద్ధి చెందింది. 

రిజర్వేషన్​లపై సందిగ్ధం

2019లో అప్పటి బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ పదేండ్లకు వర్తించేలా రిజర్వేషన్​ నిర్ణయం తీసుకొని పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఇప్పుడు అదే రిజర్వేషన్లు అమలవుతాయా? అనే డౌట్​ అంతటా ఉంది. కొత్తగా 15 పంచాయతీలు ఏర్పాటు చేస్తూ గెజిట్​వెలువడినందున కచ్చితంగా రిజర్వేషన్​లు మారుతాయని ఆఫీసర్లు అంటున్నారు. బీసీ రిజర్వేషన్​ను పెంచే ప్రణాళిక గవర్నమెంట్​ రూపొందిస్తున్నందున  రిజర్వేషన్​లు మారతాయనే వాదన ఉంది. 

కొత్త ఏర్పడిన గ్రామ పంచాయతీలు

ఆర్మూర్​ సెగ్మెంట్​లోని ఆర్మూర్​ మండలం పల్లె​, మాక్లూర్​ మండలంలో రామస్వామి క్యాంపు, మెట్టు, నందిపేట మండలం జుట్టిపేట, రైతుఫారం, కోటగిరి మండలంలోని ఎక్లాస్​పూర్​ క్యాంప్​, ఎత్తొండ క్యాంప్​, శ్రీనివాస్​రెడ్డి కాలనీ, పోతంగల్​ మండలం బాకర్​ఫారం, జల్లాపల్లి ఓల్డ్​ విలేజ్​, జల్లాపల్లి తాండ, తిర్మలాపూర్​, పీఎస్​ఆర్ నగర్​, వర్ని మండలం రూప్లానాయక్​ తాండ, రుద్రూర్​ మండలం కొండాపూర్​.