లయకారుడి  పంచభూత శివలింగాలు.. ఎక్కడ ఉన్నాయంటే....

లయ కారకుడైన మహాశివుడికి సంబంధించి పంచభూత శివలింగాలు మనకు చేరువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉండడం విశేషం. వీటిని దర్శించడం భక్తులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఈ శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ భారతదేశంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి పర్వదినాన సందర్శించడం జన్మధన్యంగా భావిస్తారు భక్తజనం. లయకారుడైన శివుడిని ఎక్కడ వెదకాలని పరితపించే భక్తులకు ఈ పంచభూత స్థలదేవాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థల దేవాలయాలు. విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుడిదేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్నాయి. 

ఆకాశలింగం...చిదంబరం ( తమిళనాడు)

 భారతదేశంలోని అతిపెద్ద ఆలయ గోపురాల్లో ఈ ఆలయ గోపురం కూడా ఒకటి.  తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరం పట్టణంలో తిల్లై నటరాజ ఆలయం ఉంది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం.  పరమశివుడు ఇక్కడ మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. 
భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు. దీనిని సూచిస్తూ మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే కనిపిస్తుంది. అంటే నిరాకారుడుగా ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటాడు. ఈ ఆలయంలో మహాశివుడు చంద్రమౌళీశ్వర స్పటిక లింగం, నృత్య భంగిమలో ఉన్న నటరాజ స్వామి, రూపం లేని శూన్యంగా భక్తులకు దర్శనమిస్తాడు. పరమేశ్వరుడి ఈ మూడవ రూపాన్నే ఆకాశ తత్వానికి ప్రతీకగా భావిస్తారు. స్వామి కొలువై ఉండే ఈ ప్రదేశంలో ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది. ఈ ప్రదేశాన్ని తెరతో కప్పి ఉంచుతారు.

 శంకరుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే  నటరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. చిదంబర క్షేత్రం చెన్నై నుంచి  229 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పృథ్వి లింగం....-కంచి  ( తమిళనాడు)

భారతదేశంలో అతిపెద్ద గోపురాలు గల ఆలయాల్లో కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం ఒకటి.పంచభూతలింగాల్లో పృథ్వి లింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం.   ఈ ఆలయంలో ఉన్న శివలింగం భూమికి చిహ్నం. ఇక్కడ దాదాపు 1008 శివలింగాలను ప్రతిష్టించినట్లు చెబుతారు. వెయ్యి స్తంభాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని పురాణాలు చెబుతున్నాయి.  ఓ సమయంలో గంగమ్మ... లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందనీ, అందుకు నిదర్శనగా  అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు. 3,500 సంవత్సరాల క్రితం స్వామి మామిడి చెట్టు కింద వెలిసాడు ...కాబట్టి ఏకాంబరుడు అని అంటారు. ఈ చెట్టు ఫలాలు సంతానం లేని వారికి సంతానం కలిగిస్తాయని నమ్మకం చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది.

వాయులింగం...- శ్రీకాళహస్తి  ( ఆంధ్రప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసింది వాయులింగం. సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన వాయుభూతానికి చిహ్నంగా ఈ శివలింగాన్ని పూజిస్తారు.   ప్రపంచంలోనే ఉఛ్వాస నిశ్వాసలు తీసుకునే ప్రాణశివలింగ క్షేత్రంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మిస్తారు. శ్రీకాళహస్తి గర్భాలయం కూడా అంతే. కానీ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో ఉంటాయి. దీంతో స్వామి వారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు. దీనినే వాయు తత్వానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు.  అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి. విజయవాడకు 377 కిలోమీటర్ల దూరంలో...తిరుపతి నుంచి దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకుంటారు.

జలలింగం ...జంబుకేశ్వరం ( తమిళనాడు)

తమిళనాడులో కొలువైన మరో పంచభూతలింగక్షేత్రం జంబుకేశ్వరం. పూర్వం ఇక్కడి శివలింగం ఏనుగులచే పూజలందుకోవడం, ఈ ప్రదేశంలో జంబు వృక్షాలు అధికంగా ఉండడం వలన ఈ క్షేత్రానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చినట్లు చెబుతారు.  శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడనీ చెబుతారు. ఈ ఆలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో.. ఏడు ఎత్తైన గోపురాలతో నిర్మించబడి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. జంబుకేశ్వరంలోని శివలింగాన్ని జలానికి చిహ్నంగా పూజిస్తారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. పానపట్టంపై కప్పిన ఓ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు తీసి నీళ్లు పిండి మళ్లీ వేస్తుంటారు.  భక్తులు ఈ వింతను ప్రత్యక్ష్యంగా చూడవచ్చు. చెన్నై నుంచి జంబుకేశ్వరంకు 331 కిలోమీటర్ల దూరం.  

అగ్నిలింగం....అరుణాచలం ( తమిళనాడు)

తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై లేదా అరుణాచలం క్షేత్రం ఉంది. పంచ భూతాలలోని అగ్ని భూతానికి ఇది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలము అని కొండ అని అర్ధం. దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అనే పేరు వచ్చింది. . పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది. కేవలం స్మరణంతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. వేద, పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కధనం. అక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షిచే ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది.చెన్నై నుంచి  185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం.