పల్లి రైతుకు దక్కని ‘మద్దతు’ 

వనపర్తి, వెలుగు : వనపర్తి అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో పల్లి రైతులకు కనీస మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పల్లికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌‌‌‌కు రూ. 6,783గా ప్రకటించింది. కానీ వనపర్తి మార్కెట్‌‌‌‌కు వచ్చే రైతులకు కనీస ధర కూడా దక్కడం లేదు. ఈ మార్కెట్‌‌‌‌లో క్వింటాల్‌‌‌‌కు గరిష్ఠంగా రూ. 6,517, కనిష్టంగా రూ. 4,219 ధర అందుతోంది. గతేడాది ఇదే సీజన్‌‌‌‌లో క్వింటాల్‌‌‌‌ పల్లి రూ. 8,300 పలకడం గమనార్హం.

తగ్గిన సాగు

వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం పల్లి సాగు భారీగా తగ్గింది. ప్రతి ఏడాది సుమారు 25 వేల ఎకరాల్లో సాగయ్యే పల్లి ఈ సారి కేవలం 7,471 ఎకరాల్లోనే సాగైంది. ఎకరం భూమి కోసం విత్తనాలకే రూ. 13 వేలు ఖర్చు చేయాల్సి వస్తుండగా, దుక్కి దున్నడం, సాఫ్ చేయడం, పిండి సంచులు, కలుపుతీత వంటివన్నీ కలుపుకొని మొత్తం రూ. 40 వేల దాకా ఖర్చు అవుతోంది. వాతావరణం అనుకూలించి, తెగుళ్లు సోకకుండా ఉంటే ఎకరానికి 10  క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ ఈ సంవత్సరం వర్షాల కారణంగా వేరుశనగకు తెగుళ్లు ఆశించాయి. దీంతో పూత రాలి, ఊడలు తగ్గి దిగుబడిపై ప్రభావం చూపింది. ఫలితంగా ఎకరానికి ఎనిమిది క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. ప్రస్తుతం పలుకుతున్న ధరను చూస్తే.. పెట్టుబడి పోను రైతులకు రూ. 14 వేలకు మించి మిగలడం లేదు.