నెరవేరిన కల గ్రేడ్-1 మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్​గా పాలమూరు

మున్సిపాలిటీలుగా దేవరకద్ర, మద్దూరు 
డెవలప్​మెంట్​కు బాటలు వేస్తున్న కాంగ్రెస్​ సర్కార్
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్​లోనే ఫైళ్లు

మహబూబ్​నగర్/చిన్నచింతకుంట/మద్దూరు, వెలుగు: మహబూబ్​నగర్​ ప్రజల కల నెరవేరింది. ఏండ్లుగా పాలమూరును కార్పొరేషన్​గా చేయాలనే డిమాండ్​ తెరమీద ఉండగా.. కార్యరూపం దాల్చలేదు. నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్రను మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ చేయాలని డిమాండ్లు ఉన్నా.. గత ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోలేదు. కార్పొరేషన్​, మున్సిపాలిటీ ప్రకటనలు చేయడం, ప్రపోజల్స్​ పంపామని చెప్పడం తప్ప వీటిని గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సాధించలేదు. కానీ, కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పాలమూరును గ్రేడ్–1 మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్​గా.. దేవరకద్ర, మద్దూరు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్​గ్రేడ్​ చేసేందుకు నిర్ణయించింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రాంతాలను కార్పొరేషన్​గా.. మున్సిపాల్టీలుగా అప్​గ్రేడ్​ చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటన చేశారు. 

3.40 లక్షల జనాభా..

హైదరాబాద్​కు వంద కిలోమీటర్ల దూరంలో ఉండడంతో మహబూబ్​నగర్​ మున్సిపాలిటీ స్పీడ్​గా డెవలప్​ అవుతోంది. నేషనల్​ హైవేలు, రైల్వే మార్గం ఉండడంతో వ్యాపార, వాణిజ్యపరంగా పాలమూరు గ్రేడ్​–1 మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు కూడా భారీ డిమాండ్​ ఉంది. పైగా గ్రేడ్–1 గా ఉన్న ఈ మున్సిపాలిటీలో జనాభా 3.40 లక్షలకు దాటింది. దీంతో కార్పొరేషన్​కు కావాల్సిన అర్హత సాధించింది. అయితే గతంలోనే పాలమూరు కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ కావాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఖమ్మంతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రాలను కార్పొరేషన్లుగా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం అప్​గ్రేడ్​ చేయగా.. పాలమూరును కార్పొరేషన్​ చేయాలనే ప్రపోజల్స్​ వచ్చినా పక్కన పెట్టేసింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాలమూరును కార్పొరేషన్​ చేస్తామని చెప్పినా.. అది కార్యరూపం దాల్చలేదు. అయితే కాంగ్రెస్  ఈ డిమాండ్​ను నెరవేర్చింది. నెలన్నర కింద ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి నేతృత్యంలో పాలమూరు కార్పొరేషన్​కు ప్రపోజల్స్​ తయారు చేశారు. పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్​గా​ అప్​గ్రేడ్​ చేసేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం అప్​గ్రేడ్​కు సంబంధించిన పక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే జనాభా, అర్బన్​, రూరల్​ మండలాల్లోని కొన్ని గ్రామాలు మున్సిపాలిటీ పరిధిలోనే ఉండడంతో.. కొత్తగా చేర్చాల్సిన గ్రామాలు, కొత్త వార్డుల ఏర్పాటుపై పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు.

ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం..

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే కొడంగల్​ నియోజకవర్గంలోని మద్దూరును మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ చేస్తానని, కాంగ్రెస్​ క్యాండిడేట్​గా ఎనుముల రేవంత్​రెడ్డి మద్దూరులో నిర్వహించిన రోడ్​ షోలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన సీఎం హోదాలో ఏడాదిలోపే మద్దూరును గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ చేయించారు. ఇటీవల ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రపోజల్స్​ను ఆఫీసర్లు ప్రభుత్వానికి పంపారు. మద్దూరు అనుబంధ గ్రామాలుగా ఉన్న సాపన్ చెరువు తండా, అంబటోని వంపు, భీంపూర్, నాగంపల్లి, రెణివట్ల గ్రామ పంచాయతీలోని వాయిల్​కుంటతండా, ఎర్రగుంటతండా, రాళ్లబావిని మున్సిపాలిటీ పరిధిలోకి తెచ్చేలా ప్రపోజల్స్​ చేశారు. 14 వార్డులతో మున్సిపాల్టీగా 
అప్​గ్రేడ్​ చేయనున్నారు. 

ఐదేండ్ల తర్వాత..

2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. దేవరకద్రతో పాటు ఇదే నియోజకవర్గంలోని కొత్తకోట గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్​గ్రేడ్​ చేయాలని ప్రపోజల్స్​ పెట్టారు. కానీ, కొత్తకోటను మున్సిపాలిటీగా అప్​గ్రేడ్ చేసి.. దేవరకద్ర ప్రపోజల్స్​ను పక్కన పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేవరకద్ర మున్సిపాలిటీ ప్రకటన చేస్తారనే టాక్​ వచ్చినా.. ఫైల్​ పెండింగ్​లోనే ఉండిపోయింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే జి.మధుసూదన్​ రెడ్డి పలుమార్లు దేరవకద్రను మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ చేయాలనే ప్రతిపాదనను సీఎం రేవంత్​ రెడ్డి ముందు ఉంచారు. ఇందుకు ఆయన ఓకే చెప్పారు. ఆఫీసర్లు పంపిన ప్రపోజల్స్​ ప్రకారం మీనుగోనిపల్లి, బల్సుపల్లి, చౌదర్​పల్లి, పెద్దగోప్లాపూర్ గ్రామలను ఈ మున్సిపాలిటీలో విలీనం చేయనున్నట్లు సమాచారం.

మంచి రోజులు వచ్చినట్లే..

వెనుకబడిన దేవరకద్ర ప్రాంతాన్ని మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ చేయడంతో త్వరగా అభివృద్ధి చెందుతుంది. మహబూబ్​నగర్–​-రాయచూర్​కు మెయిన్​ సెంటర్​గా కావడం, రైల్వే మార్గం ఉండడంతో వ్యాపార, వాణిజ్య పరంగా కూడా డెవలప్​మెంట్​ సాధిస్తుంది. పెద్ద మొత్తంలో నిధులు వస్తే సమస్యలు తీరుతాయి. 
- గడ్డమీది రవి , వ్యాపారి, దేవరకద్ర

రోడ్లు, డ్రైనేజీ సిస్టం బాగుపడ్తది..

జిల్లా, మండలాల పునర్విభజనలో భాగంగా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం 49 గ్రామ పంచాయతీలు ఉన్న మద్దూరు మండలాన్ని రెండు చీల్చింది. కానీ, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజల కోరిక మేరకు సీఎం మద్దూరును మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ చేయడం హర్షణీయం. మున్సిపాలిటీ అయితే డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పడుతుంది. రోడ్లు అభివృద్ధి చెందుతాయి. అశోక్​ గౌడ్, మద్దూరు