పాలమూరు పంప్‎ల డ్రై రన్​సక్సెస్.. ఎలాంటి నష్టం జరగలేదన్న ఇంజనీర్లు

నాగర్​కర్నూల్, వెలుగు: పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులోని 8వ ప్యాకేజీలో వట్టెం గ్రామం వద్ద నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్, పంప్​హౌజ్‎లో ఇరిగేషన్ అధికారులు గురువారం పంపుల డ్రై రన్‎ను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ పార్థసారథి, కాంట్రాక్ట్​ ఏజెన్సీ సిబ్బంది సమక్షంలో ఒక పంప్​డ్రై రన్​ నిర్వహించారు. డ్రై రన్​సక్సెస్​ కావడంతో ఇంజనీర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలకు నీట మునిగిన వట్టెం పంప్​హౌజ్‎లో పంపులు, మోటార్లకు భారీ నష్టం వాటిల్లి పూర్తి స్థాయిలో పని చేస్తాయో లేదోనని ఉన్న అపోహాలు తొలగిపోయాయని తెలిపారు. నాలుగు పంపులు రెడీ అయ్యాయని, ఐదవ పంప్​పనులు నడుస్తున్నాయని చెప్పారు. పవర్​సప్లై రాగానే అన్ని పంపులను చార్జ్​చేస్తామని తెలిపారు.

పాలమూరుపై సీఎం, మంత్రి ప్రత్యేక దృష్టి

వరద నీటిలో మునిగిన వట్టెం పంప్​హౌజ్‎ను రికార్డ్​ టైంలో డీ వాటరింగ్​ పూర్తి చేశామని ఈఈ సత్యనారాయణరెడ్డి తెలిపారు. నీట మునిగిన పంపుల భాగాలను డ్రై చేసి మళ్లీ ఫిక్స్​చేసి డ్రై రన్​సక్సెస్​ చేశామని, పూర్తి స్థాయిలో ఆర్పీఎం టెస్ట్​ చేశామని చెప్పారు. మొదటి ప్యాకేజిలోని నార్లాపూర్‏లో కొంత పని పెండింగ్‏లో ఉందని, అది పూర్తయితే కర్వెన వరకు నీరిస్తామన్నారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రాజెక్ట్​ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఏడాదిలోగా అన్ని పనులు పూర్తి చేసి కృష్ట వరద సమయంలో రిజర్వాయర్లను నింపుతామని చెప్పారు. ​