పాలమూరు పాపం గత సర్కారుదే!

  •     శంకుస్థాపన చేసిన ఏడేండ్లకుగానీ డీపీఆర్​ ఇవ్వని వైనం
  •     ప్రాజెక్టు నీటి వాటాలపైనా కేంద్రానికి రిప్రజెంటేషన్లు ఇయ్యలే
  •     అందువల్లే ప్రాజెక్టుకు జాతీయ హోదా దూరం
  •     పాలమూరు జాతీయ హోదాపై సమాచారం కోరిన ఆర్టీఐ యాక్టివిస్ట్​ ఇనుగంటికి కేంద్రం రిప్లై

హైదరాబాద్​, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా రాకపోవడానికి కారణం గత బీఆర్ఎస్​ పాలకులేనా? ఆ ప్రభుత్వం ఏడేండ్ల మొద్దు నిద్రే పాలమూరు ప్రాజెక్టుకు చేటు తెచ్చిందా? అంటే అవునన్న సమాధానమే వస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధ.. అప్పుడెప్పుడో 2005లో మొదలైన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు డిమాండ్​పై పెట్టి ఉంటే ఈపాటికి ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ జిల్లాల ప్రజలకు మేలు కలిగి ఉండేది. గత ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్​లను లేట్​గా సమర్పించడం, నీటి వాటాలు తేలకపోవడంతోనే జాతీయ హోదా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

 తాజాగా ఆర్టీఐ యాక్టివిస్ట్​ ఇనుగంటి రవికుమార్​ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదాపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోసం దరఖాస్తు చేయగా.. కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. కేడబ్ల్యూడీటీ (కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​) అవార్డు, ప్రాజెక్టు డీపీఆర్​లు, ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డి రిప్రజెంటేషన్​, ప్రాజెక్టుకు నీటి కేటాయింపులకు అడ్డుతగులుతున్న కేడబ్ల్యూడీటీ అడిషనల్​ టర్మ్స్​ వంటి వాటిని ఉదహరిస్తూ సమాధానం చెప్పింది. 

డీపీఆర్​ చాలా లేట్​గా..

తెలంగాణ నుంచి పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్​ (డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​) 2022 సెప్టెంబర్​ 13న అందిందని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ప్రాజెక్టుకు అసలు నీటి కేటాయింపులే జరగలేదని నిరుడు అక్టోబర్​6న ఇచ్చిన గెజిట్​లో పేర్కొన్నామని గుర్తు చేసింది. ప్రస్తుతం వీటిపై రివ్యూలు జరుగుతున్నాయని, కాబట్టి అవి పూర్తయ్యే వరకు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవానికి పాలమూరు లిఫ్ట్​పై 2005 నుంచే డిమాండ్లు వినిపించాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపు మీదున్న సమయంలో 2013లో అప్పటి సీఎం కిరణ్​ కుమార్​ రెడ్డి తూతూ మంత్రంగా ప్రాజెక్ట్​ సర్వేకు జీవో విడుదల చేశారు. 

అది సరిగ్గా జరగలేదు. ఆ తర్వాత పరిణామాల క్రమంలో తెలంగాణ రావడంతో సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్​​2014లో మరోసారి ప్రాజెక్టు సర్వేకు అనుమతించారు.  2015లో ఈ ప్రాజెక్టుకు కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. కానీ, అక్కడి నుంచి ప్రాజెక్టులో ఎక్కడా వేగం కనిపించలేదు. అన్నింట్లోనూ నత్తనడకే.  కేంద్రానికి ఏడేండ్ల దాకా ప్రాజెక్టు డీపీఆర్​నూ  సమర్పించలేకపోవడం పాలమూరు ప్రాజెక్టుపై గత బీఆర్ఎస్​ సర్కారు నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది. 2022లో గత బీఆర్ఎస్​ సర్కారు డీపీఆర్​ను సీడబ్ల్యూసీకి సమర్పించగా.. ఇప్పటికీ ఆ డీపీఆర్​ పరిశీలన కొనసాగుతూనే ఉండటం గమనార్హం. 

నీటి కేటాయింపులపైనా మాట్లాడలే 

అప్పటికే కట్టిన ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులను కలిపి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది.  811 టీఎంసీల నీటి వాటాల నుంచే పాలమూరు– రంగారెడ్డికి నీటిని కేటాయించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదిలోకి అనుసంధానించడం ద్వారా వచ్చే మిగులు జలాల్లోని వాటాలను గోదావరి వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ కేటాయించింది. అయితే, వాటి నుంచి అదనపు కేటాయింపులను కేడబ్ల్యూడీటీ, జీడబ్ల్యూడీటీల ద్వారానే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

 నీటి వాటాలపై ఇప్పటికీ కేడబ్ల్యూడీటీ రిపోర్ట్​ఇవ్వనేలేదు. ఈ ఏడాది మార్చి చివరి వరకు రిపోర్ట్​ఇచ్చేందుకు ట్రిబ్యునల్​కు గడువు ఉన్నది. ఈ ఏడాది జనవరిలో కేంద్రానికి రిప్రజెంటేషన్​ ఇచ్చిన సీఎం రేవంత్​ రెడ్డి, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి ఇదే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. సీఎం రేవంత్​రెడ్డికి లేఖ ద్వారా వెల్లడించింది. ఆ వివరాలనే ఇనుగంటి రవికుమార్​కూ కేంద్ర జల్​శక్తి శాఖ అందజేసింది. సీఎంకు రాసిన లేఖ, కేడబ్ల్యూడీటీ అడిషనల్​ టీవోఆర్​పై నిరుడు విడుదల చేసిన గెజిట్​ను ఇచ్చింది.

 వాటిలోని వివరాలను పేర్కొంటూ ప్రాజెక్టుకు జాతీయహోదా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటి నుంచే పాలమూరు ప్రాజెక్టుకు గత ప్రభుత్వం నీటి కేటాయింపులపై ఒత్తిడి చేసి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల విషయంలో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కేంద్రానికి కనీసం లేఖలు కూడా రాయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.