ఖైదీల్లో పరివర్తన రావాలి : పాలమూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. పాపిరెడ్డి

  • పాలమూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఖైదీలు పరివర్తన చెంది మంచి వైపు అడుగులు వేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. పాపిరెడ్డి సూచించారు. గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా జైలులో గాంధీ విగ్రహానికి, ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలు సంస్కారం, నైపుణ్యం పెంపొందించుకొని జైలు నుంచి వెళ్లాక మంచి ఆలోచనలతో కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు.

మనుషులు పుట్టుకతోనే నేరస్థులు కారని, చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం, క్షణికావేశంలో నేరస్థులుగా మారతారని చెప్పారు. మహాత్మా గాంధీ అహింసతోనే గుర్తింపు పొందారని తెలిపారు. బ్రిటీష్  కాలంలో కారాగారాలు చాలా దారుణంగా ఉండేవని, స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. జైలులో ఖైదీలకు పునరావాసంతో పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, అడిషనల్  కలెక్టర్  మోహన్ రావు, అదనపు జిల్లా జడ్జి కల్యాణ్  చక్రవర్తి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ డి.ఇందిర, జైల్​ సూపరింటెండెంట్  ఎ వెంకటేశం పాల్గొన్నారు.