ఏసీబీకి చిక్కిన పాలమూరు డీఈవో

  • టీచర్​ నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టివేత

పాలమూరు, వెలుగు: మహబూబ్​నగర్  ఇన్​చార్జి డీఈవో రవీందర్ ఏసీబీకి చిక్కాడు. ఓ టీచర్  ప్రమోషన్ విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఉదయం తన ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. మహబూబ్​నగర్  ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్  తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మహబూబ్​నగర్  జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఒక గ్రామంలోని స్కూల్​ టీచర్​కు ప్రమోషన్ రావాల్సి ఉంది. కానీ, డీఈవో ఆఫీసులో చేసిన నిర్లక్ష్యం వల్ల సీనియార్టీ లిస్టులో ఆమె పేరు లేకుండా పోయింది. ఆమె కన్నా సీనియార్టీ తక్కువగా ఉన్న మరో మహిళా టీచర్​కు ప్రమోషన్  వచ్చింది. దీంతో సదరు టీచర్ వివరాలను సేకరించి, మహబూబ్​నగర్  ఇన్​చార్జి డీఈవోను ఆశ్రయించారు. తాను ఇప్పుడు ఏమీ చేయలేనని కోర్టుకు వెళ్లి పర్మిషన్  తెచ్చుకోవాలని సూచించారు. ఆమె కోర్టు నుంచి అనుమతిని తెచ్చుకున్నారు.

కానీ, ప్రమోషన్  ఇవ్వడానికి డీఈవో రూ.2 లక్షలు డిమాండ్ చేసి, లక్షన్నర తీసుకుని ప్రమోషన్  ఇచ్చాడు. ప్రమోషన్  ఇచ్చిన అనంతరం సీనియారిటీ విషయంలో తనకన్నా జూనియర్  తర్వాతే పేరు ఉండడం వల్ల ఫ్యూచర్​లో తనకు మళ్లీ నష్టం జరిగే ప్రమాదం ఉందని, తన సీనియారిటీని సరి చేయాలని డీఈవోకు సదరు మహిళా టీచర్  తన భర్తతో కలిసి వెళ్లి విజ్ఞప్తి చేసింది. ఇందుకు మళ్లీ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని డీఈవో చెప్పడంతో.. ఆమె రెండోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా సీనియార్టీని సరి చేయాలని ఆదేశించింది. కానీ, కోర్టు ఆదేశాలను డీఈవో అమలు చేయకుండా అదనంగా మరో లక్ష ఇవ్వాలని డిమాండ్  చేశారు. చివరకు రూ.50 వేలకు ఒప్పుకున్నాడు.

న్యాయంగా తనకు రావాల్సిన ప్రమోషన్  రాకుండా, జూనియర్ కు ఇవ్వడమే కాకుండా కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా లంచం డిమాండ్  చేయడంతో సదరు మహిళా ఉపాధ్యాయురాలు తన భర్తతో కలిసి ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు డీఈవో ఇంట్లో రూ.50 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. డీఈవో​ను అదుపులోకి తీసుకున్నామని ఏబీసీ డీఎస్సీ తెలిపారు.