ఇందిరమ్మ ఇల్లు లేని ఊరే లేదు : వంశీచంద్​రెడ్డి​ 

మిడ్జిల్, వెలుగు: ఆంజనేయస్వామి గుడి, ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్లు ఉండవని మహబూబ్ నగర్  కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ వంశీచంద్ రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీటింగ్​కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి, స్పోర్ట్స్  అథారిటీ చైర్మన్, యూత్  కాంగ్రెస్  అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ మిడ్జిల్  మండలం నుంచి కాంగ్రెస్​ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఉన్నప్పుడు సిలిండర్  ధర రూ.400 ఉండేదని, ప్రస్తుతం రూ.1,200కు చేరిందని,  ఈవిషయాన్ని మహిళలు గమనించాలని కోరారు.

కాంగ్రెస్  ప్రభుత్వం రూ.500 కే సిలిండర్  ఇస్తుందని తెలిపారు. పదేండ్ల బీజేపీ, బీఆర్ఎస్​ పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, ప్రస్తుత కాంగ్రెస్  ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, దళితులకు రూ.6 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ కరెంట్​ బిల్లులు ఎవరూ కట్టవద్దని, ఎవరైనా అడిగితే ఎమ్మెల్యేను అడగమని చెప్పాలన్నారు. మిడ్జిల్  మండలం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి సీఎం, తాను ఎమ్మెల్యే అయ్యామని, వంశీచంద్ రెడ్డిని కూడా ఆశీర్వదించాలని కోరారు.

లిక్కర్ కేసులో జైల్లో ఉన్న కవితను జైలు నుంచి విడిపించుకోవడానికే బీఆర్ఎస్​ నేతలు బీజేపీకి ఓట్లు వేయమని కోరుతున్నారని విమర్శించారు. టీపీసీసీ సెక్రటరీ రబ్బానీ, మాజీ జడ్పీటీసీ భీమయ్య గౌడ్, అల్వాల్ రెడ్డి, గౌస్, నర్సింహ, రాములు, జగన్, ఉస్మాన్, పర్వతాలు, అశోక్, మల్లికార్జున్ రెడ్డి, జహీర్, రమేశ్, బాలస్వామి, కృష్ణ, హరి గౌడ్  పాల్గొన్నారు.