పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనా వేయడం కష్టం. ఈ మధ్య పసికూన జట్లపై ఓడిపోతూ తీవ్ర విమర్శలకు గురైన ఆ జట్టు.. తాజాగా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచి బిగ్ షాక్ ఇచ్చారు. ఆదివారం (నవంబర్ 10) పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి 2-1 తేడాతో సిరీస్ గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా విధించిన 141 పరుగుల టార్గెట్ ను 26.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 143 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనర్లు సైమ్ అయూబ్(42), అబ్దుల్లా షఫీక్ (37) మంచి ఆరంభం ఇవ్వగా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (28), బాబర్ అజాం (30) మిగిలిన పని పూర్తి చేశారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి కేవలం 140 పరుగులకే ఆలౌటైంది. బౌలర్ సీన్ అబాట్ 30 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అఫ్రిది, నజీమ్ షా విజృంభించి తలో మూడు వికెట్లు పడగొట్టారు.
ఈ సిరీస్ లో తొలి వన్డేలో ఓడిన పాక్.. రెండు, మూడు వన్డేల్లో భారీ విజయాలను సాధించింది. 2002 లో చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్థాన్ సిరీస్ గెలిచింది. 22 ఏళ్ళ తర్వాత మరోసారి కంగారూల గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు పాక్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ కు లభించాయి.
First ODI series win for Pakistan in Australia after a long 22 years ?
— CricTracker (@Cricketracker) November 10, 2024
?: Disney+Hotstar pic.twitter.com/KNhHZZOQIv