Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోనున్న పాక్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 వివాదం సద్దుమణగడం లేదు. బీసీసీఐ తమ జట్టును పాకిస్థాన్‌కు పంపమని తేల్చిచెప్పినప్పటికీ, దాయాది దేశం తన మొండి పట్టుదలను వదలడం లేదు. బీసీసీఐ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, మ్యాచ్‪లను తమ గడ్డపై కాకుండా మరొక చోట నిర్వహించాల్సి వస్తే, టోర్నీ నుండి తప్పుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయించుకుందట.

పాకిస్థాన్ పోము..: బీసీసీఐ

ప్రభుత్వం అనుమతిస్తేనే తమ జట్టు పాకిస్థాన్‍లో పర్యటిస్తుందని బీసీసీఐ ముందు నుంచే చెప్తోంది. ఈ విషయంపై రెండ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో.. తమ జట్టును పొరుగు దేశానికి పంపబోమని భారత క్రికెట్ నియంత్రణా మండలి ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో తటస్థ వేదికల్లో ఆడేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది. అయితే, ఇందుకు పాక్ ససేమిరా అంటుంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించే ప్రసక్తే లేదని చెబుతోంది.

ఒకవేళ తమ ఆతిథ్య హక్కులను తగ్గించే పరిస్థితే వస్తే, ఏకంగా టోర్నీని వీడాలని పాక్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇరు దేశాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు.. భారత్‌లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని పీసీబీ నిర్ణయించుకుందట. అలా అని తేల్చిచెప్పడమూ లేదు. దాగుడుమూతలు ఆడుతోంది. ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై పాక్ బోర్డు.. ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ప్రభుత్వ పెద్దలు ఏమి చెప్తే.. ఆ సూచనలు పాటించనుందని సమాచారం.

ఒకవేళ పాకిస్థాన్ ఆతిథ్య హక్కులను వదులుకుంటే, ఛాంపియన్స్ ట్రోఫీని సౌతాఫ్రికాకు తరలించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐసీసీ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9, 2025 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.