న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో మళ్లీ ప్రతిష్ఠంభన నెలకొంది. ఈస్టర్న్ లడఖ్‌లో ఇండో-చైనాలు భారీ సంఖ్యలో బలగాలను మోహరించాయి. ఇరు దళాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ విషయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఓ మిషన్‌లో భాగంగానే చైనా, పాక్ కలసి బార్డర్ వివాదాన్ని సృష్టిస్తున్నాయని రాజ్‌నాథ్ ఆరోపించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) ప్రాజెక్టుల కనెక్టివిటీకి సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోర్డర్ వివాదంపై పలు వ్యాఖ్యలు చేశారు.
‘నార్తర్న్, ఈస్టర్న్ బార్డర్స్‌లో నెలకొన్న ఉద్రిక్తతల గురించి అందరికీ తెలుసు. తొలుత దీనికి పాకిస్తాన్ కారణమని చెప్పాలి. ఇప్పుడు చైనా కూడా అదే పని చేస్తోంది. ఆ రెండు దేశాలు కుట్రపూరితంగా ఓ మిషన్‌లో భాగంగానే సరిహద్దు ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. ఆ దేశాలతో మనకు 7 వేల కి.మీ.ల బార్డర్ ఉంది. ఇక్కడ ప్రతి రోజూ ఉద్రిక్తతలను క్రియేట్ చేస్తున్నారు’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద చైనా ఉద్రిక్తతలు సృష్టిస్తుండగా, మరోవైపు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి దాయాది పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
