PAK vs SA: సొంతగడ్డపై సఫారీల తడబాటు.. పాకిస్థాన్ సరికొత్త చరిత్ర

సఫారీల గడ్డపై దాయాది పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య ప్రొటిస్‌ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి స్వదేశంలో దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా అవతరించింది. ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం(డిసెంబర్ 22) జరిగిన మూడో వన్డేలో పాక్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వారి ఫామ్ ఇతర జట్లకు హెచ్చరిక లాంటిదే.

రెండో వన్డే మాదిరిగానే.. ఆఖరి గేమ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో, మ్యాచ్ ను 47 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ ఆదిలోనే అబ్దుల్లా షఫీక్‌(0) వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో మరో ఓపెనర్ సైమ్ అయూబ్(94 బంతుల్లో 101) అద్భుతమైన నాక్ ఆడాడు. రెండో వికెట్ కు బాబర్ అజామ్‌తో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత బాబర్ వెనుదిరిగినా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి 93 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దాంతో, పాక్ నిర్ణీత 47 ఓవర్లలో  308 పరుగులు చేసింది.

సఫారీలు మళ్లీ అదే తప్పు..

లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. పదే పదే ఒకటే తప్పును పునరావృతం చేశారు. నిలకడలేమి ప్రధాన సమస్య అయితే.. స్పిన్నర్లను ఎదుర్కోవడానికి స్క్వేర్ లెగ్ మీదుగా షాట్లు ఆడటం వారి కొంపముంచింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌(81) ధనాధన్‌ బ్యాటింగ్‌తో కాసేపు అలరించినప్పటికీ.. కీలక సమయంలో ఔటవ్వడం జట్టును ఓటమి పాలు చేసింది. రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌ (35), టోనీ డి జోర్జి(26) ఫర్వాలేదనిపించారు.

ALSO READ : Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫిబ్రవరి 23న ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్!

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 3-0తో వైట్‌వాష్‌ చేసింది. అంతకుముందు 21 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.