ENG vs PAK 1st Test: ఇది పిచ్ ఏంట్రా.. తారు రోడ్డు: ఇంగ్లండ్ - పాక్ తొలి టెస్టుపై నెట్టింట జోకులు

మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆతిథ్య పాక్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు తొలి టెస్ట్ ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకూ 50 ఓవర్ల ఆట జరగ్గా.. ఆతిథ్య జట్టు కేవలం ఒకటే వికెట్ నష్టపోయింది. ఓవర్‌కు ఐదారు పరుగుల చొప్పున వన్డే తరహాలో పరుగులు వస్తున్నాయి. ఇదిలానే కొనసాగితే తొలి రోజు ఆటలో పాక్ 400 పరుగులు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే విమర్శలకు దారితీస్తోంది. 

బంగ్లా చేతిలో క్లీన్‌స్వీప్

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. సొంత గడ్డపై 250 పైచిలుకు పరుగులు చేయడానికి ఆతిథ్య పాక్ బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. అలాంటిది నెలన్నర వ్యవధిలోనే ఆ జట్టు ఆటగాళ్లు గాడిలో పడ్డారంటే అక్కడ ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలి. విజయం సాధించకపోయినా పర్లేదు కానీ, ఓటమి బారిన పడకుండా పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సరికొత్త ప్రణాలికను అమలు చేసింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు మంచి బ్యాటింగ్ పిచ్ తయారుచేసేలా స్టేడియాల క్యురేటర్లకు ముందుగానే ఆదేశాలిచ్చారు. దాంతో ఉపఖండ పిచ్‌లను స్టేడియం నిర్వాహకులు తారు రోడ్లులా తయారు చేశారు. 

ALSO READ | Champions Trophy 2025: భారత్‌ సహా అన్ని జట్లు పాకిస్థాన్‌ వస్తాయి..: పీసీబీ చైర్మన్

ముల్తాన్ పిచ్‌పై బౌలర్లకు ఎలాంటి సహకారం లభించడం లేదు. స్వింగ్ సంగతి దేవుడెరుగు కనీస బౌన్స్ కూడా అవ్వట్లేదు. దాంతో బ్యాటర్లు అలవోకగా పరుగులు చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తంలో ఒక్కసారి 50 పరుగులు చేయని ఆ జట్టు ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(94*) ఈ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ దిశగా సాగుతున్నాడు.  దాంతో, ఈ మ్యాచ్‌పై అభిమానులు నెట్టింట జోకులేస్తున్నారు. హైవే తరహాలో ముల్తాన్ స్టేడియం పిచ్ ఉందంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.