హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం :గరికపాటి నరసింహారావు

మెదక్, వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మ పరిరక్షణే తన ధ్యేయమని మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు అన్నారు. ఆదివారం రాత్రి మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రవచనాలు వినిపించారు. సమున్నతమైన మన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రవచనాలు వినిపించేందుకు అమెరికా రావాలని ఎంతో మంది తనను ఆహ్వానించారని అయితే దేశాన్ని కాదని విదేశాలకు వెళ్లిన వారికంటే  ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలే తనకు ముఖ్యమని అక్కడికి వెళ్లడం లేదన్నారు. 

పిల్లలను కనడం, పెంచడం, చదువు, ఉద్యోగాల విషయంలో ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావల్సిన అవసరం ఉందన్నారు. ఇతరుల పిల్లల్లా తమ పిల్లలు ఐఐటీ వంటి ఉన్నత చదువులు చదవాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలను కొంటున్నారు తప్ప వారు ఎదుర్కొనే ఇబ్బందులు గుర్తించడం లేదన్నారు. చదువు తలకు మించిన భారమై ఐఐటీలో చదువుతున్న ఎంతో మంది  పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుండడం బాధాకరమన్నారు. ఇతరులను చూసి తమ పిల్లలను సైతం అమెరికా పంపాలనే ఆలోచనకు తల్లి దండ్రులు స్వస్తి పలకాలని, వారికి నచ్చిన కోర్సు చదువుకునే స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు, ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమ నిర్వాహకులు ప్రభాకర్ పాల్గొన్నారు.