- ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
- పెట్టుబడుల భారంతో మినుము సాగుకు షిఫ్ట్
- పామాయిల్, మామిడి తోటల్లో అంతర్ పంటగాను సాగు
మహబూబ్నగర్, వెలుగు: పల్లీ రైతులు మినుము సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ యాసంగి సీజన్లో పల్లీకి బదులు రైతులు మినుము విత్తనాలు వేస్తున్నారు. పల్లీ సాగుకు పెట్టుబడుల ఖర్చు ఎక్కువవుతుండటం, పంట అమ్ముకునే సమయంలో ధరలు సరిగా ఉండకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే మినుము పంట వైపు రైతులు షిఫ్ట్ అవుతున్నారు.
పెరుగుతున్న పెట్టుబడులు..
మినుమును రైతులు ఆరుతడి పంటగాను, అంతర్ పంటగాను సాగు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పామాయిల్, దానిమ్మ, మామిడి తోటలను కొత్తగా పెంచుతున్న రైతులు మినుము సాగును అంతర్ పంటగా పండిస్తున్నారు. పాలమూరు జిల్లాలో 10 శాతం మంది రైతులు పల్లీకి బదులుగా మినుము విత్తనాలు వేసుకున్నారు. పల్లీ సాగుకు ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోంది. పల్లీ పీకడానికి, కాయలు వేరు చేయడానికి కూలీల కొరత ఉండడం.. కూలీలు దొరికినా వారికి అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
దీంతో ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. ఇందులో కేవలం పల్లీ విత్తనాలకే రూ.13,500 నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పంట చేతికి వచ్చాక మార్కెట్లో మద్దతు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంటను ఎంచుకుంటున్నారు. దీంతో మినుము సాగుకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో రైతులు ఈ పంట సాగును ప్రారంభించారు.
మినుముకు రూ.10 వేల లోపే ఖర్చు..
మినుము సాగుకు ఎకరాకు రూ.10 వేలలోపే పెట్టుబడి అవుతోంది. ఎకరా పంట సాగు చేయడానికి 12 కిలోల నుంచి 15 కిలోల విత్తనాలు అవసరం అవుతుండగా.. ఈ విత్తనాలు కిలో రూ.250 దొరుకుతున్నాయి. 15 కిలోల ప్యాకెట్ మార్కెట్లో రూ.2,500 లభ్యమవుతుంది. ఈ పంటకు పురుగు మందు పిచికారి కూడా పెద్దగా అవసరం ఉండదు.
కేవలం డీఏపీ, యూరియాను రెండు, మూడు సార్లు చల్లుకుంటే సరిపోతుంది. నీటి కొరత ఉన్న రైతులు తక్కువ నీటి వసతితో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తిన 70 రోజుల నుంచి 80 రోజులకే పంట కాతకు వస్తుంది. మార్కెట్లో కూడా మినుముకు డిమాండ్ ఉంది. క్వింటాల్ మినుము ధర రూ.6,500 నుంచి రూ.7,800 వరకు పలుకుతోంది. లాభాలు మంచిగా వస్తుండడంతో రైతులు ఒకే సీజన్లో రెండు సార్లు ఈ పంటను సాగు చేస్తున్నారు.
ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం..
మినుము సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో మినుము సాగు విస్తీర్ణం 45,259 ఎకరాలు కాగా.. ఈ ఏడాది దాదాపు 65 వేల నుంచి 70 వేల ఎకరాల్లో పంట సాగు అవుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
అత్యధికంగా సంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, మెదక్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో నిరుడు కంటే ఈసారి 6 నుంచి 10 శాతానికి పంట సాగు పెరిగే చాన్స్ ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.